మాటతప్పను.. మడమ తిప్పను అని జగన్మోహన్ రెడ్డి తన గురించి తాను చాలా గట్టిగానే డప్పు కొట్టుకుంటూ ఉంటారు. పరిస్థితులు అన్నీ అనుకూలించినప్పుడు.. ఎవరైనా ఇలాంటి డప్పు కొట్టుకోవచ్చు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ముందడుగు వేసే వాళ్లే నాయకులుగా ఎదుగుతారు. ప్రస్తుతం కేవలం 11 మంది ఎమ్మెల్యేల నాయకుడిగా ఉన్న జగన్మోహన్ర రెడ్డి.. లండన్ నుంచి తిరిగివచ్చిన వెంటనే తొలి వెనుకడుగు వేశారు.
ఫిబ్రవరి 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమాన్ని ఆయన వాయిదా వేసుకున్నారు. ఈ ఫీజు పోరు వాయిదా వేసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న కారణాలు ఏమైనప్పటికీ.. వాస్తవంలో.. పార్టీకి క్షేత్రస్థాయిలో బలం తగ్గడం, అధినేత పిలుపు ఇస్తే పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించడానికి ముందుకు వచ్చే నాయకులు లేకపోవడమే కారణం అని తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల్లో ఓడిపోయిన తొలినాటినుంచి.. కూటమి ప్రభుత్వం తొందర్లో కూలిపోతుంది.. అంటూ శకునాలు పలుకుతూనే ఉన్నారు. ప్రతిరోజూ ప్రభుత్వాన్ని ఏదో ఒక తీరుగా విమర్శిస్తూనే.. రెండు నెలల కిందట..ఈ ప్రభుత్వానికి తానిచ్చిన హనీమూన్ పీరియడ్ ముగిసిపోయిందని.. ఇక ప్రత్యక్ష పోరాటాలకు దిగుతాం అంటూ ప్రజాపోరాటాల కార్యచరణ ప్రణాళికను ప్రకటించారు. మూడు పోరాటాలకు షెడ్యూలు కూడా ప్రకటించారు.
రెండు కార్యక్రమాలు ఆల్రెడీ తుస్సుమన్నాయి. కలెక్టరేట్ల ఎదుట నిర్వహించిన ధర్నాలు, విద్యుత్తు కార్యాలయాల ఎదుట నిర్వహించిన ధర్నాలు.. పార్టీకి ఏమాత్రం మైలేజీ తీసుకరాలేదు. పైగా ఏడునెలలు కూడా గడవకుండా పోరాటాలంటూ తమ మీద ఒత్తిడి పెడుతున్నారని ఆరోపిస్తూ కొందరు నాయకులు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు కూడా. జగన్ ప్రకటించిన పోరాటాల్లో ఫీజు పోరు ఫిబ్రవరి 5న జరగాల్సి ఉంది. తాజాగా ఆ కార్యక్రమానికి సారథ్యం వహించడానికి కూడా క్షేత్రస్థాయిలో నాయకులు సిద్ధంగా లేరని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ను బూచిగా చూపించి.. దీనిని వైసీపీ వాయిదా వేసింది.
కోడ్ అమల్లో ఉన్నప్పటికీ.. తమ ఫీజు పోరుకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. అయితే ఈసీ నుంచి స్పందన రాలేదంటూ 2వే తేదీనాడే.. పోరు రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. కనీసం ఈసీ అనుమతి కోసం ఇంకో రెండు రోజులు వేచిచూడగల అవకాశం ఉన్నప్పటికీ.. పోరు చేసే ధైర్యం లేకనే విరమించుకున్నట్టుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కూతురు గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లిన జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చారు. ఈలోగా పార్టీలో చాలా పరిణామాలు జరిగాయి. ఆయన ప్రస్తుతం వాటిమీనే దృష్టి సారిస్తున్నారని.. ఫీజు పోరు వంటివి పట్టించుకునే స్థితిలో లేరని పార్టీ వర్గాలు అంటున్నాయి.