కేంద్ర బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పడానికి కొన్ని కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయి. బడ్జెట్లో అసలు ఏపీ పేరునే ప్రస్తావించలేదని, దానివలన రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల పరంగా అన్యాయం జరుగుతుందని వైసీపీ దళాలు వికృత ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇలాంటి కువిమర్శకులకు చాలా ఘాటైన సమాధానమే ఇచ్చారు. బడ్జెట్ లో పేరు ప్రస్తావిస్తేనే నిధులు వచ్చినట్లా? అని ప్రశ్నించారు.
నిజానికి కేంద్ర బడ్జెట్ లో కేంద్ర పథకాలకు ఎప్పటిలాగా నిధులు వాటాలు సమానంగానే ప్రకటించారు. ఇలాంటి కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకింత ఎక్కువ ఎడ్వాంటేజీ ఉండే అవకాశం కూడా ఉంది. చంద్రబాబునాయుడు కూడా అదే విషయాన్ని ధ్రువీకరించారు. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన పథకాలను సమర్థంగా, గరిష్టంగా వినియోగించుకునే అవకాశం ఏపీకి ఎక్కువగా ఉన్నదని.. ఈ మేరకు రాష్ట్రప్రజలకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని ఆయన అంటున్నారు. తమ ప్రభుత్వం ఇదివరకే ఆయా రంగాల్లో తదనుగుణమైన కొత్త పాలసీలు తెచ్చిందని కూడా గుర్తుచేస్తున్నారు.
సాధారణంగా బడ్జెట్ లో నిర్దిష్టమైన కేంద్రపథకాలకు చేసే కేటాయింపులు మాత్రమే కనిపిస్తాయి. కానీ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తున్న ఫలితం.. మనకు అనేక రకాలుగా కనిపిస్తూనే ఉంది. కేంద్ర బడ్జెట్ అనే పదంతో సంబంధం లేకుండా మనకు ఇప్పటికే ఎన్నెన్ని నిధులు వచ్చాయో లెక్కేలేదు.
పోలవరం ప్రాజెక్టు కోసం గానీ, అమరావతి నిర్మాణాల కోసం గానీ కేంద్రం నుంచి చంద్రబాబునాయుడు సాధించుకువచ్చిన వేలకోట్ల రూపాయల నిధులు కేంద్ర బడ్జెట్ స్వరూపంలో కనిపించినవి కాదు. నిస్వార్థంగా రాష్ట్రం కోసం పనిచేసే ప్రభుత్వం ఉన్నప్పుడు.. ఏ ప్రతిపాదనతోనైనా కేంద్రాన్ని ఒప్పించి వారినుంచి నిధులు తీసుకురావడం సాధ్యమవుతుంది.
జగన్మోహన్ రెడ్డి తన అయిదేళ్ల పదవీకాలంలో.. ఢిల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలోనూ.. తన కేసుల మాఫీ గురించి, వివేకాహత్య కేసుల్లో రక్షణ గురించి కేంద్రంలోని పెద్దలతో మంతనాలు చేయడానికే సరిపోయింది. నిధులు సాధించడం ఆయనకు చేతకాలేదు. ఎన్డీయే సర్కారు.. నిధుల విషయంలో- బడ్జెట్ లో పేరు ప్రస్తావన ఉన్నా లేకపోయినా.. పుష్కలంగా సాధిస్తున్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.