దావోస్ కు ఏపీ నుంచి ప్రతినిధుల బృందం వెళ్లి రావడం వల్ల ఎలాంటి ఫలితం దక్కబోతున్నదో, ఏం ప్రయోజనం రాష్ట్రానికి ఒనగూరుతుందో.. వెళ్లి వచ్చిన వాళ్లు మాత్రమే చెప్పగలరు. గట్టున కూర్చుని కబుర్లు మాట్లాడే వారికి చెరువులోని నీటి లోతు తెలియదు, చలి తెలియదు, చెరువులో దిగి చేపలు పట్టడం వలన కలిగే లాభం కూడా తెలియదు. ఆ ప్రకారం చూసినప్పుడు.. దావోస్ పర్యటన వల్ల సాధించిందేమీ లేదంటూ.. వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు.. నిరాశాజనక వాతావరణంలోకి రాష్ట్రాన్ని నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నాయి గానీ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారాలోకేష్ లతో కలిసి వెళ్లిన పరిశ్రమల మంత్రి టీజీ భరత్ తాజాగా వెల్లడిస్తున్న వివరాలు ఎన్నో కొత్త ఆశలు పుట్టిస్తున్నాయి.
దావోస్ నుంచి తిరిగివచ్చిన తర్వాత టీజీ మీడియాతో మాట్లాడుతూ అనేక సంగతులు వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు రావడం ఖాయం అని భరత్ అంటున్నారు. దావోస్ లో ముఖ్యమంత్రి సారథ్యంలోని ఏపీ బృందం.. ఐదురోజుల వ్యవధిలో ఏకంగా వందకు పైగా పారిశ్రామికవేత్తలతో సమావేశాల్లో పాల్గొని రికార్డు సృష్టించారని భరత్ చెబుతున్నారు.
ఈ సమావేశాల్లో ఏపీలో గల అవకాశాల గురించి తెలుసుకుంటూ ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలు చూపించిన స్పందన గమనించిన తర్వాత.. రాబోయే అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు రావడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని అనిపిస్తున్నదని భరత్ చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఏడునెలల పాలనలోనే 4.10 లక్షల ఉద్యోగాలు కల్పించేలా.. చంద్రబాబు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకున్నది అనే సంగతిని కూడా భరత్ గుర్తు చేస్తున్నారు. అంటే ఇంచుమించుగా.. అన్నీ కలిపి సుమారు 25 లక్షల ఉద్యోగాల వరకు అయిదేళ్లలో అందుబాటులోకి రావొచ్చనని అర్థమవుతోంది.
పాతిక లక్షల ఉద్యోగాలు అంటే మాటలు కాదు. మంత్రి టీజీ భరత్ చెప్పినట్టుగా పాతికలక్షల్లో సగం 12-13 లక్షల ఉద్యోగాలు వచ్చినా.. చంద్రబాబునాయుడు సర్కారు ఒక అద్భుతం సృష్టించినట్టే లెక్క. అలా కాకుండా.. భరత్ చెప్పిన దానిలో పావు వంతు అనగా, ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చినా కూడా.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం చాలా గొప్ప సక్సెస్ సాధించినట్టు అని ప్రజలు అనుకుంటున్నారు. వాలంటీర్లు అనే ముసుగులో, తన పార్టీకి ఏజంట్లుగా పనిచేయడానికి, ఉపయోగంలేని కొలువులు యువతకు కట్టబెట్టి.. అయిదేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టుగా జగన్ డప్పు కొట్టుకున్నారు. అలాంటిది.. ప్రెవేటు సెక్టార్లోనే భరత్ చెప్పిన గణాంకాల్లో కనీసం పావు వంతుగా ఆరులక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినా.. జనం ఈ ప్రభుత్వాన్ని మళ్లీ మళ్లీ నెత్తిన పెట్టుకుంటారని ప్రజలు విశ్లేషిస్తున్నారు.