పశ్చాత్తాపం : సైకోల తర్వాత ఇప్పుడు నాయకుల్లోనే!

తమ కళ్ల ఎదురుగా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు-  స్పందించకుండా, కనీసం తమ అభిప్రాయం కూడా చెప్పకుండా.. మౌనం పాటించి.. ఏళ్లు గడచిపోయిన తర్వాత.. అప్పట్లో జరిగిన ఫలానా వ్యవహారం తప్పు, వాళ్లు తప్పు చేశారు.. అని మాట్లాడడం నిజాయితీ అనిపించుకోదు. అది కేవలం అవకాశ వాదం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో.. అత్యంత వివాదాస్పదులుగా ముద్ర ఉన్న కొందరిలో ఒకరైన అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇప్పుడు ధర్మపన్నాలు వల్లిస్తున్నారు. తాను మంచివాడినని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి మాటల వెనుక మతలబు మనకు తెలియదు గానీ.. మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు.. పశ్చాత్తాపం అనేది నిన్నటిదాకా సోషల్ మీడియాలో సైకోలలో వెల్లువలా వచ్చింది. తీరా ఇప్పుడు చూస్తే.. కేతిరెడ్డి వంటి మాజీల్లో మొగ్గతొడుగుతున్నట్టుగా కనిపిస్తోంది.

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒక మీడియా చానెల్ తో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును రాక్షసుల్లా హింసిస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్లిపోయిందని అంటున్నారు. అన్యాపదేశంగా తమ పార్టీ అధినేతను ఇండైరక్టుగా రాక్షసుడితో పోలుస్తున్నారు. కేతిరెడ్డి అక్కడితో ఆగడం లేదు. ‘అవతలి వారు ఎంతలా తిడుతున్నా, హేళన చేసినా చంద్రబాబు చాలా ఓపికగా ఉన్నారు. చంద్రబాబును అరెస్టు చేయడం, పవన్ కల్యాణ్ ను అనవసరంగా తిట్టడం.. తెదేపా జనసేనలు ఏకం కావడానికి ఉపయోగపడింది’ అని కేతిరెడ్డి ధ్రువీకరిస్తున్నారు. ఈ మాటలన్నీ కూడా ఆనాటి జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గపు పోకడలని, జగన్ స్వయంగా తీసుకున్న నిర్ణయాల్ని తప్పు పడుతున్నవే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇవి మాత్రమే కాదు.. అప్పట్లో జగన్ ను తిట్టారు అనే నెపం పెట్టి.. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి వ్యవహారాన్ని కూడా కేతిరెడ్డి తప్పు అంటున్నారు. ఇలాంటి దాడులు పార్టీ శ్రేణులకు ఒక తప్పుడు విధానాన్ని నేర్పించినట్లు అవుతాయిన చెబుతున్నారు. అంతా బాగానే ఉంది.. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలో హఠాత్తుగా పొడసూపిన ఈ పశ్చాత్తాపానికి కారణం ఏమిటి? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
అధికారంలో ఉన్న సమయంలో.. అత్యంత దూకుడుగా వ్యవహరించిన వైసీపీ నాయకుల్లో ఆయన కూడా ఒకరు. చంద్రబాబును రాక్షసంగా హింసించిన సంగతి అప్పట్లో కనిపించలేదా? అని ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు జగన్ ప్రాభవం దిగజారిపోయింది గనుక.. జగన్ ను ధిక్కరించి మాట్లాడినా పర్లేదనుకుంటున్నారా? అని విశ్లేషిస్తున్నారు. సరైన సమయంలో స్పందించకుండా.. ఇలా అధికారంపోయిన తర్వాత నీతులు వల్లించడం అవకాశ వాదం అవుతుందే తప్ప మరొకటి కాదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories