జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ టు స్థాయిలో ఆ పార్టీని నడిపించిన, ఏ2గా ఆయన అవినీతి కేసులలో ఆయన సహచరుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం మాత్రమే కాదు.. తన లాయల్టీని కూడా మార్చేసినట్లుగా కనిపిస్తోంది! ‘వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశారని.. ఆయన దుర్మార్గుడని.. అనేక రకాలుగా నిందిస్తూ ఉన్న, ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ కావడం.. మూడు గంటలకు పైగా రాజకీయ అంశాలపై చర్చలు సాగించడం.. ఇప్పుడు సర్వత్రా సంచలనాంశంగా మారుతోంది. ఇద్దరు నాయకుల విందు భేటీ ఎలాంటి భవిష్యత్ రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో పలువురు అంచనాలు సాగిస్తున్నారు!
జగన్మోహన్ రెడ్డి– షర్మిల మధ్య ఆస్తుల తగాదాలు తారస్థాయికి చేరిన తర్వాత.. ఇద్దరూ పరస్పరం అనేకం విమర్శించుకున్నారు.ఒకవైపు నుంచి సూటిగా తన అన్నను నానా మాటలు అంటూ ఆయన చేసిన ద్రోహాలను ఏకరవు పెడుతూ షర్మిల విమర్శలు చేశారు. మరొకవైపు జగన్ ప్రాపకం కోసం ఆరాటపడే ఆయన అనుచర గణాలు అందరూ షర్మిల మీద విరుచుకుపడుతూ వచ్చారు.
తమ కుటుంబంలో జరిగిన ఒప్పందాలు అందులోని వాస్తవాల సంగతి విజయసాయిరెడ్డికి తెలుసు అని ఒక సందర్భంలో ప్రస్తావించిన తర్వాత.. విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి షర్మిల అబద్ధాలు చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. దీనిపై ఆమె మండిపడటం కూడా జరిగింది. విజయ సాయి– జగన్ వద్ద పనిచేస్తున్నారు కనుక ఆయన ప్రాపకం కోసమే మాట్లాడుతారు అంటూ చాలా తీవ్రమైన భాషలో షర్మిల నిందించారు.
అదే క్రమంలో విజయసాయిరెడ్డి తన రాజకీయ సన్యాసం విషయాన్ని ప్రకటించిన తర్వాత కూడా షర్మిల అంతే ఘాటుగా స్పందించారు. అప్పటికే వివేకానంద రెడ్డి హత్య గురించి విజయ సాయి ప్రకటనలు చేసి ఉన్న నేపథ్యంలో– ఇప్పటికైనా ఆయన నిజాలు బయటపెట్టాలని షర్మిల బహిరంగంగా కోరారు. జగన్ విశ్వసనీయత కోల్పోయిన నాయకుడు కాబట్టే విజయసాయి రెడ్డి కూడా వైకాపా నుంచి వెళ్ళిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఆమె ఏనాడూ విజయసాయిని ఉపేక్షించలేదు. ఇన్ని పరిణామాల తర్వాత కూడా ప్రస్తుతానికి రాజకీయ సన్యాసం ప్రకటించి ఉన్న విజయసాయిరెడ్డి, షర్మిల ఇంటికి వెళ్లి కలవడం, విందు స్వీకరించడం, మూడు గంటల పాటు వర్తమాన రాజకీయాల గురించి చర్చించడం సంచలనాంశంగా ఉంది. ఈ ఇద్దరి భేటీ ముందు ముందు ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తుందో చూడాలి.