వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వ సామర్థ్యం మీద ఆ పార్టీలో కొనసాగుతున్న నాయకుల్లో నమ్మకం, విశ్వాసం అలాగే ఉన్నదా? సడలిపోతున్నదా? జగన్ ను నమ్ముకుంటే తమ రాజకీయ భవిష్యత్తు భద్రంగానే ఉంటుందనే ఆశ వారిలో మిగిలుందా? అనే ప్రశ్నలకు పార్టీలో ఎవ్వరూ సరైన జవాబు, సూటిగా స్పందన చెప్పలేకపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. విజయసాయిరెడ్డి నిష్క్రమణకు ముందు- నిష్క్రమణ తర్వాత.. అన్నట్టుగా మారిపోయింది. తాజాగా తెలుస్తున్న విశ్వసనీయ సమాచారాన్ని బట్టి.. ఏపీ శాసనమండలిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి, అవసరమైతే తమ ఎమ్మెల్సీ పదవులను కూడా వదులుకోవడానికి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ పార్టీలో మరొక కీలక నాయకుడు, రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాటలే ఇందుకు ఉదాహరణగా కనిపిస్తున్నాయి.
మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య తదితరులు రాజీనామా చేయడానికి పూర్వమే మరికొందరు రాజ్యసభ ఎంపీలు కూడా పార్టీని వీడనున్నట్టు బలంగా వినిపించింది. వారిలో పారిశ్రామికవేత్త, ఎంపీ అయోధ్య రామిరెడ్డి పేరు ప్రముఖంగా ఉంది. అప్పట్లో అయోధ్య, పిల్లి సుభాష్ తదితరులు తాము పార్టీని వీడడం లేదని ఖండించారు. కొన్ని నెలల విరామం తరువాత.. అనూహ్యంగా వేణుంబాక విజయసాయిరెడ్డి తన రాజీనామా నిర్ణయాన్ని హఠాత్తుగా ప్రకటించారు. ఆ పార్టీ వారికే అది మింగుడుపడలేదు. ఆ సందర్భంలో కూడా విజయసాయితోపాటు, అయోధ్య రామిరెడ్డి రాజీనామా కూడా ఉంటుందని పుకార్లు వినిపించాయి.
అయోధ్య రామిరెడ్డి వాటిని ఖండించారు. తాను పార్టీని వీడేది లేదని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాటలను ప్రత్యేకంగా గమనించాలి. పార్టీ ఓడిపోయింది గనుక.. తమపై సహజంగా రాజీనామాలకు ఒత్తిడి ఉంటుందని.. విజయసాయి ఆ ఒత్తిడి తట్టుకోలేకపోయారని అన్నారు. అలాగే అనేకమంది ఎమ్మెల్సీల మీద కూడా పార్టీకి రాజీనామా చేయాలనే ఒత్తిడి ఉన్నదని అయోద్య రామిరెడ్డి వివరించారు. నిజానికి ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై కొట్టేశారు. అయితే వారి రాజీనామాలను ఆమోదించకుండా.. బలవంతంగా సంఖ్యాబలాన్ని కాపాడుకుంటున్నారు. అయోధ్య మాటల ప్రకారం.. మండలిలోని మరింత మంది ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోంది.
మండలిలో మెజారిటీ సభ్యులున్న పుణ్యమాని.. అక్కడి పార్టీ ఫ్లోర్ లీడర్ బొత్స సత్యనారాయణ ఏదో కేబినెట్ హోదాతో అలరారుతున్నారు. ఎమ్మెల్సీల రాజీనామాలు మరిన్ని చోటు చేసుకుంటే ఆ పార్టీలో ఒకే ఒక్క వ్యక్తికి ఉన్న ప్రాభవం కూడా మంటగలిసిపోతుందని విశ్లేషకులు అంటున్నారు.