తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వారి సమస్యలన, వినతులను ఆలకించడం అనేది ఒక ప్రయారిటీ కార్యక్రమంగా పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిన అయిదేళ్లపాటు, ప్రభుత్వానికి తమ సమస్యలు చెప్పుకోవడం అనే అంశానికి అవకాశమే లేకుండా గడిపిన ప్రజలకు ఇది మహా గొప్పగా కనిపించింది. తెలుగుదేశం పార్టీ తరఫున.. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో వినుతులు స్వీకరించే ఏర్పాటుచేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే వీటిని ప్రారంభించారు. ప్రతిరోజూ కొందరు కీలక పార్టీ నాయకులు, మంత్రులు అందుబాటులో ఉంటూ వినతులు స్వీకరించేవారు. అయితే ఇలా ప్రజల కష్టాలను, సమస్యలను ఆలకించే వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని తాజాగా వికేంద్రీకరించడానికి పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో నలుమూలల నుంచి తమ సమస్యలు చెప్పుకోవడం కోసం రాజధాని వరకు రావడం.. ప్రజలకు ప్రయాస అవుతున్నందున.. వారికి ఇబ్బంది లేకుండా ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలే వినతులు స్వీకరించాలని పార్టీ తలపోస్తోంది.
ప్రతి శనివారం ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గ కేంద్రాల్లో అందుబాటులో ఉండి.. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించాలని.. వాటి పరిష్కారానికి కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం నిర్ణయించింది. అలాగే మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కూడా ప్రతి శనివారం మాత్రం మంత్రులు, ఆ స్థాయి కీలక నాయకులు అందుబాటులో ఉండి ఎవరైనా అక్కడిదాకా వస్తే వారి వినతులు తీసుకుంటారు. మిగిలిన రోజుల్లో కూడా వచ్చిన వారినుంచి వినతులు స్వీకరించేందుకు ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నారు.
పాలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండకపోవడం వల్లనే.. ప్రజలు కష్టనష్టాల కోర్చి మంగళగిరి కేంద్ర కార్యాలయం వరకు వస్తున్నారని.. దీనివలన వారికి వ్యయప్రయాసలతో పాటు, పార్టీ కార్యాలయానికి వచ్చే కార్యకర్తలకు కూడా ఇబ్బంది కలుగుతోందని చంద్రబాబు చెప్పారు. మొత్తానికి వినతుల స్వీకరణ అనేది నిత్య క్రతువులాగా జరుగుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఇచ్చే ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత.. జనసేన పవన్ కల్యాణ్ కూడా తమ పార్టీ కార్యాలయంలో ప్రజలనుంచి వినతులు స్వీకరించడం ప్రారంభించారు. ఇప్పుడు వారు కూడా తమ తమ ఎమ్మెల్యేలకు బాధ్యత అప్పగించేలా.. వికేంద్రీకరిస్తారా? లేదా.. ప్రజలంతా పార్టీ కేంద్ర కార్యాలయానికే వచ్చి కష్టాలు చెప్పుకునే పద్ధతిని కొనసాగిస్తారా వేచిచూడాల్సి ఉంది.