జగన్ కబుర్లు చెబితే.. బాబు కార్యరూపం ఇస్తున్నారు!

అమరావతిని స్మశానంగా మార్చదలుచుకోవడం తప్ప ముఖ్యమంత్రిత్వం వెలగబెట్టిన జగన్మోహన్ రెడ్డికి అప్పట్లో వేరే లక్ష్యం ఏదీ కనిపించలేదు. కేవలం అమరావతి వృద్ధిని మట్టుపెట్టడం కోసం ఆయన మూడు రాజధానుల కాన్సెప్ట్ను తెరమీదకు తీసుకువచ్చారనే సంగతి అందరికీ తెలుసు. మాయమాటలతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి అనే బూటకపు మాటలతో ప్రజలను వంచించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు.

మాటలే తప్ప ఆ దిశగా కూడా ఆయన చేసిన ప్రయత్నం ఏదీ లేదు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంలో 500 కోట్లతో తన నివాస భవనాన్ని టూరిజం ఆస్తిగా నిర్మించుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి నిర్దిష్టంగా ఒక్క పని కూడా చేయలేదు. ఇటు రాయలసీమ విషయానికి వస్తే కర్నూలుకు ఏ హైకోర్టు గురించి హామీ ఇచ్చారో.. దానికి సంబంధించి కనీసంగా కూడా అడుగులు పడలేదు. కేవలం కబుర్లతో, చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారంటూ ఆరోపణలతో జగన్మోహన్ రెడ్డి కాలం వెళ్ళబుచ్చారు.

ప్రభుత్వం మారిన తర్వాత అన్ని ప్రాంతాలకు న్యాయం చేయడం అంటే ఏమిటో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విస్పష్టంగా చూపిస్తోంది. రాజధానిగా అమరావతిలో సమీకృత అభివృద్ధి పనులను వేగిరపరుస్తూనే.. అటు విశాఖపట్నాన్ని  ఐటి కేంద్రంగా తిరుగులేని ఆర్థిక నగరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఇటు కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకురావడానికి కూడా సీరియస్ కసరత్తు చేస్తున్నారు.

ఈ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అయితే న్యాయమూర్తులకు ఉండగల వసతి సదుపాయాల గురించి వివరాలు ఇవ్వాల్సిందిగా కర్నూలు కలెక్టరుకు హైకోర్టు రిజిస్ట్రార్ లేఖ రాశారు కూడా! వెంటనే స్పందించిన కలెక్టర్ ఇందుకోసం ప్రభుత్వ ప్రైవేటు భవనాలను పరిశీలించాలంటూ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. మరొకవైపు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం కోసం కర్నూలు నగర శివారు ప్రాంతంలో ఉన్న ఏపీఈఆర్సీ భవనాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నది.

హైకోర్టు తరఫు కూడా బెంచ్ ఏర్పాటుకు సీరియస్ గా అడుగులు పడుతున్నట్లు మనకు అర్థమవుతోంది. ఎందుకంటే 15 మంది న్యాయమూర్తులకు సరిపడా సౌకర్యాల వివరాలు కావాలని.. అలాగే కోర్టు కాంప్లెక్స్, కోర్టు గదులు, సిబ్బంది గదులు, న్యాయవాదులకు వసతి తదితర అన్ని సౌకర్యాలకు సంబంధించిన వివరాలను కేవలం ఒక్క రోజులోనే తమకు తెలియజేయాలంటూ హైకోర్టు రిజిస్ట్రార్ 29న కర్నూలు కలెక్టర్కు రాసిన లేఖ గమనార్హం. అంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ స్వప్నం త్వరలోనే సాకారం కాబోతున్నదని అర్థమవుతోంది. జగన్ కబుర్లు చెప్పిన మూడు నగరాల్లోనూ.. ఇప్పుడు అభివృద్ధి కార్యరూపం దాలుస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories