ముఖ్యమంత్రిగా ప్రజలు ఒక్కచాన్స్ ఇచ్చినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తన వంతుగా ఎంత నష్టం చేయగలరో అంత నష్టమూ చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అభివృద్ధి పనులు కుంటుపడేలా చేశారు. అమరావతి రాజధానిని స్మశానంగా మార్చేశారు. ఎన్నిరకాల వికృత విధ్వంసక చర్యలు చేయవచ్చునో.. అన్ని రకాలూ చేశారు. ఆయన వినాశనం తలపెట్టిన వాటిలో పోలవరం డ్యామ్ కూడా ఒకటి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 70 శాతం పనులు పూర్తిచేసి ఇస్తే.. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. తన సొంత మనుషులకు కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం వంద రకాల వక్రమార్గాలు అనుసరించారు. పనులు చేస్తూ ఉన్న సంస్థను ఉన్నపళంగా తొలగించారు. రివర్స్ టెండరింగ్ అన్నారు. కోట్లు మిగలబెట్టాను అన్నారు. పనులు మాత్రం పూర్తి చేయలేదు. అప్పట్లో ప్రభుత్వం చేతగానితనానికి ఇప్పుడు పడిన అదనపు భారమే 596 కోట్ల రూపాయల మేర ఉంటోంది. మొత్తానికి ఆ భారాన్ని కూడా భరిస్తూ.. రాష్ట్రానికి జీవనాడిగా భావించగల పోలవరం డ్యామును పూర్తిచేయడానికి చంద్రబాబు సర్కారు కృతనిశ్చయంతో అడుగులు ముందుకు వేస్తోంది.
పోలవరం డ్యామ్ లో కొత్త డయాఫ్రం వాల్ ను రూ.990 కోట్లతో నిర్మించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో జగన్ 393 కోట్లతో మరమ్మతులకు టెండర్లు పిలిచారు. కానీ పనులు మాత్రం జరగలేదు. కేంద్ర జలశక్తి సంఘ నిపుణులు, విదేశీ నిపుణులు అంతా పరిశీలించిన తర్వాత.. డివాల్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. ఇందకు పాత కాంట్రాక్టరుకు అప్పటిధరలకే నులు అప్పగించారు. పెరిగిన పనికి మాత్రం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అప్పట్లో పని చేయకపోవడం వల్ల .. ఇప్పుడు పెరిగిన పనికి 596 కోట్ల మేర అదనపు భారం పడుతోంది.
జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును కూడా తనకు సొంత ఆదాయవనరుగా చూసుకున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దాని ప్రాధాన్యాన్ని ఎన్నడూ గుర్రతించలేదని మనకు తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. కేంద్రం వద్దనుంచి పోలవరం కోసం సకాలంలో నిధులు తీసుకురావడం గురించి ఆయన ఎన్నడూ శ్రద్ధ పెట్టలేదు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ప్రెస్ రిలీజ్ లో మాత్రం ఆ అంశం చొప్పించేవాళ్లు. పోలవరం పనులు మేం 70 శాతం పూర్తిచేశాం అని తెలుగుదేశం వాళ్లు చెప్పుకున్న ప్రతిసారీ.. దానికి కౌంటర్ గా అసలు పోలవరం ప్రాజెక్టు రూపశిల్పి వైఎస్ రాజశేఖర రెడ్డి అని చాటుకోవడం తప్ప జగన్ చేసిందేమీలేదు. పోనీ తన తండ్రి కలల ప్రాజెక్టు అని చెప్పుకుంటున్నందుకు అయినా.. దానిని పూర్తి చేయడంపై ఆయన శ్రద్ధ పెట్టారా? అంటే అదీ లేదు. మొత్తానికి పోలవరం ప్రాజెక్టుకు కూడా జగన్ పాలన శాపంగా మారింది. ఇప్పుడా పరిస్థితిని చక్కదిద్దేందుకు కూటమి ప్రభుత్వం పాట్లు పడుతోంది.