రెండు తెలుగు రాష్ట్రాల్లోను మూడేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగడానికి షెడ్యూలు విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. 27న పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న ఓట్లు లెక్కిస్తారు. ఏపీలో రెండు పట్టభద్ర స్థానాలకు, ఒక ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగడం బాగానే ఉంది గానీ.. ఈ ఎన్నికల్లో బరిలోకి దిగి.. ప్రభుత్వం మీద తాను ప్రచారం చేస్తున్న వ్యతిరేకత ప్రజల్లో వచ్చిందని నిరూపించేందుకు తొడకొట్టే సాహసం జగన్మోహన్ రెడ్డికి ఉన్నదా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లోనే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఓడిపోయింది. ఆ ఓటమి ప్రభావం సార్వత్రిక ఎన్నికల మీద కనిపిస్తుంది కదా.. అని అప్పట్లో అందరూ అంచనాలు వేశారు. అయితే ప్రభుత్వం తరఫున సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి.. పట్టభద్ర ఎన్నికలు అంటే.. అవి తమ పార్టీని అభిమానించే వర్గానికి చెందిన ఓటు బ్యాంకు కాదని చెప్పుకున్నారు. అంటే.. పట్టభద్రులు, చదువుకున్నవాళ్లు, నిరుద్యోగులు తమకు ఓటు వేయరనే క్లారిటీ ఆయనకు ఆనాటికే ఉందన్నమాట. తమ పథకాల లబ్ధిదారులైన వర్గాల ఓట్లతో సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాం అన్నారు. కానీ.. ఆ ఎన్నికల్లో కూడా ఫలితం ఏమిటో తేటతెల్లమైంది.
ఓడిపోయిన నాటినుంచి జగన్మోహన్ రెడ్డి ఒకటే పాట పాడుతున్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత వచ్చేసింది అని అంటున్నారు. రెండేళ్లలో ఎన్నికలు జరుగుతాయి.. ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని జోస్యాలు చెప్పుకుంటూ జగన్ బతుకుతున్నారు. ఆయన చెప్పినట్టుగా.. చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందో లేదో తేల్చుకోవడానికి ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రెండు పట్టభద్ర ఎమ్మెల్సీలు, ఒక టీచరు ఎమ్మెల్సీ లకు ఎన్నికలు జరుగుతాయి. టీచరు ఎమ్మెల్సీ అంటే.. టీచర్ యూనియన్లు ప్రభావితం చేస్తాయి గనుక ఆ సంగతి పక్కన పెట్టవచ్చున. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. గెలిచే సత్తా సంగతి తర్వాత.. కనీసం అభ్యర్థిని పోటీకి దింపడానికి జగన్మోహన్ రెడ్డికి ధైర్యముందా? అనేది ఇప్పుడు చర్చ! అభ్యర్థిని దింపే సత్తా లేక.. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో అవినీతికి పాల్పడుతుంది గనుక.. ఎన్నికలకు దూరంగా ఉంటాం అనే పలాయనమంత్రం పఠిస్తారని పలువురు అంచనా వేస్తున్నారు.