డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందో.. ఆంధ్రప్రదేశ్ లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతి, పోలవరం, రైల్వేజోన్, ఇతర ప్రాజెక్టుల పరంగా ఇప్పటికే కేంద్రప్రభుత్వం అన్ని రకాలుగానూ ఆంధ్రప్రదేశ్ కు ఉదారంగా సాయం అందిస్తోంది. మరోవైపు ప్రతి విషయంలోనూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ.. మరింతగా నిధులు తీసుకురావడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే విజయవాడ, విశాఖపట్నంలలో మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటు దిశగా తొలి అడుగు కూడా పడింది. ఇక్కడ మెట్రో రైలు ఏర్పాటు చేయడానికి భూసేకరణ చేపట్టాలంటూ.. చంద్రబాబునాయుడు ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
విజయవాడ, విశాఖపట్నం నగరాలలో తొలిదశ మెట్రో రైలు పనులకు గత డిసెంబరులో జరిగిన ఏపీ మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. రెండు నగరాల్లోనూ తొలిదశ పనులకు 11,009 కోట్ల రూపాయలు అవసరం అని తేల్చారు. డీపీఆర్ లను కూడా సిద్ధం చేశారు. వాటిని కేంద్రప్రభుత్వం ఆమోదానికి పంపారు. అయితే ఈ మెట్రో రైలు వ్యవస్థలకు వంద శాతం నిధులు సమకూర్చి సహకరించాల్సిందిగా చంద్రబాబునాయుడు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అటువైపు నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. అయినాసరే.. కేంద్రం మీది నమ్మకంతో.. భూసేకరణ దిశగా ముందడుగు వేస్తున్నారు చంద్రబాబునాయుడు.
విజయవాడలో 101 ఎకరాలు, విశాఖలో 98 ఎకరాలు స్థలం మెట్రో కోసం కావాల్సి ఉంటుందని అంచనా వేశారు. దీనికి సంబంధించి సేకరణ పనులు పూర్తిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కేంద్రంనుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేలోగా.. భూసేకరణ పర్వం పూర్తయితే.. వెంటనే పనులు ప్రారంభించడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఫాలోఅప్ చేస్తున్నారు.
చంద్రబాబునాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మెట్రో రైల్ ను తీసుకురావడానికి తన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. దురదృష్టవశాత్తూ ఈలోగా ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అన్ని అభివృద్ధి పనులను అటకెక్కించినట్టే.. ఈ విషయంలోనూ వ్యవహరించారు. కనీసం విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఊదరగొట్టారు గానీ.. అక్కడైనా మెట్రో పనులు ముందడుగు వేయించలేకపోయారు. చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కాగానే.. ఈదిశగా దృష్టి పెట్టారు. భూసేకరణ పర్వం పూర్తయ్యేలోగా కేంద్రం ఆమోదం వస్తే.. వెంటనే పనులు మొదలయ్యే వెసులుబాటు ఏర్పడుతుంది.