తీగ లాగితే డొంక కదిలినట్టుగా అనేక వాస్తవాలు వెలుగులోకి రావడం గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒక తీగ లాగితే.. అనేక డొంకలు కదిలి, అనేకమంది అక్రమార్కుల బాగోతాలు వెలుగులోకి వస్తే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏపీ పరిణామాల్లో ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కామేపల్లి తులసిబాబు అనే నిందితుడు ఒక తీగ.. ఆ ఒక్క తీగలాగితే.. అధికార, రాజకీయ వర్గాల్లో అనేకమంది బాగోతాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం డిప్యూటీ స్నీకరుగా ఉన్న రఘురామక్రిష్ణ రాజును గతంలో జగన్ ఏలుబడి సాగిన కాలంలో రాజద్రోహం నేరం కింద విచారించిన వ్యవహారంలో ఆయన గుండెల మీద కూర్చుని కొట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు తులసిబాబు. ఈ హత్యాయత్నం కేసులో ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో తులసిబాబు విచారణ ఎదుర్కొన్నారు. అయితే ఈ ఒక్క విషయమే కాకుండా.. విచారణలో ఇంకా తులసిబాబుతో ముడిపడిఉన్న అనేక అంశాలను బయటకు తీయడానికి ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది.
గతంలో ఏపీసీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తో అంటకాగుతూ.. ఆయనతో అనుబంధాన్ని అడ్డగోలుగా వాడుకుంటూ ఎడాపెడా దందాలు చేసిన వ్యక్తిగా తులసిబాబు ముద్రపడ్డారు. రఘురామపై హత్యాయత్నం కేసులో కూడా కీలకంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ రకంగా.. జగన్ ఏలుబడి కాలంలో.. అంతా తానై నడిపిపంచిన దందారాయుళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నారు. జగన్ పతనాన్ని అంచనా వేయగలిగారో ఏమో గానీ, సరిగ్గా ఎన్నికలకు ముందు.. తెలుగుదేశం నేత పంచకు చేరారు. గుడివాడ తెలుగుదేశం అభ్యర్థి ప్రాపకంలో ఉండి.. ఆయన విజయానికి సహకరించారు. గెలిచిన తర్వాత.. అక్కడి తెలుగుదేశం ఎమ్మెల్యేకు తానొక ప్రత్యామ్నాయ అధికార కేంద్రంలాగా చెలరేగుతూ మళ్లీ తన దందాలను తిరిగి ప్రారంభించారు. అలాంటి తులసిబాబును.. గత ప్రభుత్వ హయాంలో చేసిన పాపాలకు సంబంధించి ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు.
ప్రధానంగా.. బిగ్ బీ (బిగ్ బాస్) టీమ్ లో సభ్యులైన నలుగురు వ్యక్తులు ఎవరు? అనే విషయంలో ప్రకాశం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో సాగిన విచారణలో ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఆ నలుగురి పేర్లు వెల్లడైతే.. ఇంకా పలువురి బాగోతాలు బట్టబయలౌతాయని అంతా అనుకుంటున్నారు. దుబాయిలోని స్నేహితులతో వ్యాపారలు చేస్తున్నట్టు తులసిబాబు చెప్పడంతో.. సదరు దుబాయి స్నేహితులు వారి వ్యవహారాలపై కూడా పోలీసులు దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి కామేపల్లి తులసిబాబు అనే పేరు ఇప్పుడు ఏపీ నేరదర్యాప్తుల వ్యవహారంలో ఎంత కీలకంగతా వినిపిస్తున్నదంటే.. గతంలో ఆయనతో కించిత్ పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భయపడాల్సినంత పరిస్థితి. మొత్తానికి కొన్ని నెలల కిందటి నుంచి ఎక్స్ ఖాతాలో నీచమైన పోస్టులు పెట్టిన వర్రా రవీంద్ర రెడ్డి ద్వారా.. అనేకమంది పెద్దల వికృత బుద్ఖులు బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తులసిబాబు ద్వారా మరింత మంది బాగోతాలు వెలుగుచూస్తాయని అంచనాలు సాగుతున్నాయి.