పాపం.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి! కాలం కలిసి రాకపోతే.. కర్రే పామై కరుస్తుందని సామెత. ఇప్పుడు ఆయనకు కాలం కలసి రావడం లేదు. అన్నీ వరుస ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. వరుసగా ప్రతికూల పరిణామాలే. కేవలం తన పార్టీలోని నాయకులు క్యూకట్టి రాజీనామాలు చేసి వెళ్లిపోతుండడం మాత్రమే కాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అప్రతిష్ట పాల్జేయడానికి ఆయన తాజాగా ప్రయోగిస్తున్న, గతంలో ఎప్పటెప్పటినుంచో ప్రయోగిస్తూ వచ్చిన వక్ర అస్త్రాలు కూడా అన్నీ ఫెయిలవుతూ వస్తున్నాయి. తాజాగా సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్, న్యాయవాది శ్రీరంగారావు అనే వారు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేయడం కూడా ఇలాంటిదే. పైకి ఇతరు వ్యవహారంలా కనిపించినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డికి చేదు వార్త ఇది!
వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పటి సంగతి. అది కూడా 2003 నాటి సంగతి. అప్పట్లో హైదరాబాదు పరిసరాల్లోని గచ్చిబౌలి, మామిడిపల్లి గ్రామాల్లో స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు కోసం రాష్ట్రప్రభుత్వం రూ.50 వేలకు ఎకరావంతున 400 ఎకరాల భూములను ఐఎంజీ భారత్ అకాడమీస్ సంస్థకు విక్రయించింది. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి.. దీనిపై విచారణ జరిపించి.. ఆ ఎంఓయూను, సేల్ డీడ్ ను రద్దుచేసి సీబీఐ దర్యాప్తు కోరుతూ 2006లో జీవో జారీచేశారు. అయితే సీబీఐ ఈ కేసును తీసుకోలేదు. ముందుగా రాష్ట్రప్రభుత్వం ప్రాథమిక విచారణ జరిపించి, నేరాలను గుర్తిస్తే, ఆ తర్వాత తమకు కేసును ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. 2007లో వైఎస్సార్.. సీబీసీఐడీతో విచారణకు ఆదేశించారు. ఆయన జమానా కొంతకాలం సాగినప్పటికీ ఆ విచారణ అతీగతీ లేకుండా పోయింది. అది తేలడం లేదు కాబట్టి.. సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్, న్యాయవాది శ్రీరంగారావు 2012లో పిల్ లు వేశారు. 2006లో ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోసం జీవో ఇస్తే.. ఆరేళ్ల తర్వాత పిల్ ఎందుకు వేశారని హైకోర్టు ప్రశ్నించినప్పుడు వారి వద్ద జవాబు లేదు. వైఎస్సార్ ప్రభుత్వం ఆదేశించిన సీబీసీఐడీ దర్యాప్తు ఎందుకు పూర్తికాలేదో కూడా చెప్పలేకపోయారు. దాంతో హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడానికి నిరాకరిస్తూ 2024లో తీర్పు ఇచ్చింది.
అయితే ఏబీకే ప్రసాద్ వైఎస్ జగన్ వ్యూహంలో భాగంగానే.. ఈ పిటిషన్ వేసినట్లు పుకార్లు వచ్చాయి. ఎందుకంటే.. అప్పటికే ఆయన జగన్ ప్రారంభించిన సాక్షి పత్రికకు కొంతకాలం ఎడిటర్ గా, జగన్ సంస్థలో ఉద్యోగిగా పనిచేశారు. 2011లో వైఎస్ విజయ ఒక పిటిషన్ వేస్తే అందులో భాగస్వామిగా, విజయసాయిరెడ్డితో కలిసి ఉన్నారు.
హైకోర్టు తమ పిటిషన్ కొట్టేసిన తర్వాత ఏబీకే ప్రసాద్, శ్రీరంగారావు ఇద్దరూ సుప్రీంలో స్పెషల్ లీవ్ 2024 డిసెంబరు 30న పిటిషన్ వేశారు. 20 ఏళ్ల కిందటి వ్యవహారం (ఆ తర్వాత రద్దయిపోయింది కూడా)లో చంద్రబాబును బద్నాం చేయడానికి ప్రయత్నించారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తెర వెనుక నుంచి ప్రయోగిస్తున్న వక్ర అస్త్రాలే అని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. ఈ పిటిషన్లు విచారించిన సుప్రీం ధర్మాసనం వాటిని డిస్మిస్ చేసింది. మొత్తానికి జగన్ అస్త్రాలు మళ్లీ వీగిపోయాయి, చంద్రబాబుకు ఊరట లభించింది అని ప్రజలు అనుకుంటున్నారు.