చంద్రబాబునాయుడు తన మానాన తాను ప్రశాతంగా పనిచేసుకుంటూ పోతే.. రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందిపోతుందో.. అసలే శిథిలమైపోతున్న వైఎస్సార్ కాంగ్రెస పార్టీని రాష్ట్రప్రజలు పూర్తిగా మరిచేపోతారేమో అనే భయం.. రాష్ట్రంలో జగన్ భక్తులు చాలా మందికి ఉంటుంది. అలాంటి వారు కుదురుగా ఉండలేరు. చంద్రబాబును అధికారంలోంచి దించేయడం ఎటూ సాధ్యం కాదు.. ఏదో ఒక రకంగా ఆయనను చికాకు పెట్టే పనిచేద్దాం అని రకరకాల కుట్రలు పన్నుతుంటారు. అలాంటి ఒక కుట్రకు.. సుప్రీం కోర్టు తాజాగా గట్టిగానే మొట్టికాయలు వేసింది.
చంద్రబాబును ఇరుకున పెట్టాలనే ఒక దురుద్దేశం తప్ప మరే లక్ష్యమూ లేదన్నట్టుగా సుప్రీంలో వేసిన ఒక దావాకు సంబంధించి.. ఈ పిటిషన్ గురించి ఒక్క మాటమాట్లాడినా సరే.. భారీ జరిమానా విధిస్తామంటూ.. న్యాయమూర్తి బేలా త్రివేది హెచ్చరించేంతగా పరిస్థితి ఏర్పడిందంటే.. అది ఎంతటి కుట్రపూరితమైన పిటిషన్‌గా న్యాయపీఠానికే చిరాకు పుట్టించిందో అర్థం చేసుకోవచ్చు.
రాజకీయ ప్రేరేపిత కేసులు చాలా ఉంటాయి. కేవలం తమ రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టడం తప్ప.. ఇలాంటి కేసులకు వేరే పరమార్థం ఉండదు. ఇవాళ సుప్రీంలో విచారణకు వచ్చిన పిటిషన్.. అలాంటి కుట్రపూరిత పిటిషన్లలో పరాకాష్ట అనే చెప్పాలి. చంద్రబాబునాయుడు మీద.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వివిధ కేసులు బనాయించారు. నిబంధనల్ని కూడా పాటించకుండా.. అత్యంత అరాచకమైన శైలిలో చంద్రబాబును ఒక నిరాధారమైన కేసులో అరెస్టు చేసి.. వేధించారు. 53 రోజుల పాటు జైలులో ఉంచారు.
ప్రత్యర్థుల్ని వేధించడానికి సీఐడీని జగన్మోహన్ రెడ్డి ఒక అస్త్రంలాగా వాడుకున్నారనేది గత అయిదేళ్ల కాలంలో అందరూ గమనించిన సంగతే. ఇప్పుడు ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. సీఐడీ వద్ద పెండింగులో ఉన్న చంద్రబాబు కేసులు ఏడింటినీ.. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకు అప్పగించాలంటూ.. హైకోర్టు న్యాయమూర్తి బి బాలయ్య సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
విచారణకు రాగానే.. న్యాయమూర్తి ఈ పిటిషన్ పై ఆగ్రహించారు. అసలు ఆ కేసు వాదించడానికి ఒప్పుకున్న సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ మీద కూడా ఆగ్రహించారు. మీరు ఇలాంటి కేసులు కూడా వాదిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇలాంటివి ఎంత చెత్త రాజకీయ ప్రేరేపిత కేసులో న్యాయమూర్తి అన్యాపదేశంగా చెప్పారు. మీలాంటి సీనియర్లు ఇలాంటి కేసులకు హాజరవుతారని అస్సలు ఊహించలేదంటూ.. ఒక్క మాట కూడా మాట్లాడొద్దంటూ కేసును కొట్టివేసింది. చంద్రబాబు మీద వైసీపీ దళాలు, జగన్ బినామీలు, వారి అనుచరులు, పెయిడ్ కూలీలు చేసే కుట్రలకు ఈ సుప్రీం తీర్పు ఒక మంచి గుణపాఠం అని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ దళాల్లో మార్పు వస్తుందో లేదో మరి.