వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు రాజీనామాలు చేయడం అనే పర్వానికి ఇప్పట్లో తెరపడే అవకాశం లేదా? అవకాశం కుదిరిన వారు వలసలు వెళ్లడం, అవకాశం దొరకని వారు ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకోవడం.. ఇంకా కొనసాగబోతున్నదా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చేసిన రాజీనామా.. ఈ పర్వానికి చిట్టచివరిది కాబోదని పార్టీ వర్గాలే అంటున్నాయి. నిజానికి విజయసాయి రాజీనామాతో పాటు, పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేస్తారని బలంగా వినిపించింది. అయితే అలా జరగలేదు. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. అయోధ్య రామిరెడ్డి.. కాస్త లౌక్యం పాటిస్తున్నారని.. రాజీనామా చేయడం ఖరారే అయినప్పటికీ.. ఇంకా ముహూర్తం నిర్ణయించుకోలేదని అంటున్నారు.
అయోధ్య రామిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితులైన ఆ పార్టీ కీలక నాయకుల్లో ఒకరు. అలాగని ఆయన జగన్ కు అత్యంత విశ్వసనీయుడైన నాయకుడని అనుకునే అవకాశం మాత్రం లేదు. ఆయనకు చంద్రబాబునాయుడుతో కూడా సాన్నిహిత్యం ఉంది. ఎలాగంటే.. గతంలో తన బావమరిది మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి తెలుగుదేశం తరఫున నరసరావుపేట ఎంపీ టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. చంద్రబాబుతో స్వయంగా ఆయనే మంతనాలు జరిపి టికెట్ ఇప్పించుకున్నారు. తర్వాత.. వారంతా వైసీపీలోకి మారారు. వైసీపీ తరఫున నరసరావుపేట ఎంపీ బరిలోకి స్వయంగా దిగిన అయోధ్య రామిరెడ్డి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని గుంటూరు ఎంపీగా పోటీచేయిస్తే ఓడిపోయారు. ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఆయనకు తమ్ముడే. పార్టీకోసం చాలా కీలకంగా పనిచేసిన అయోధ్యను జగన్ రాజ్యసభ ఎంపీని చేశారు.
ఇప్పటి పరిణామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం అందరిలోనూ సన్నగిల్లిపోతోంది. అయోధ్య రామిరెడ్డి కూడా అదే నమ్మకంతో ఉన్నారు. అయితే జగన్ తో ఉన్న సాన్నిహిత్యం బెడిసి కొట్టకుండా చూసుకోవాలని ఈ పారిశ్రామికవేత్త భావిస్తున్నట్టు సమాచారం. జగన్ లండన్ లో ఉండగా రాజీనామా ప్రకటించేయడం అనేది.. ఆయనకు అవమానకరంగా ఉంటుందని… జగన్ తిరిగివచ్చిన తర్వాత.. స్వయంగా ఒకసారి వెళ్లి కలిసి.. వివిధ అవసరాల దృష్ట్యా రాజీనామా చేయాలనుకుంటున్నట్టు ఆయనతో చెప్పి, పక్కకు తప్పుకుంటారని, ఆ మేరకు లౌక్యం పాటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయోధ్య రామిరెడ్డి కూడా ఏ పార్టీలో చేరకుండా.. వైసీపీకి రాజీనామా తర్వాత పూర్తిగా తన వ్యాపారాలకే పరిమితం కానున్నట్టుగా తెలుస్తోంది.