జగన్మోహన్ రెడ్డి పెత్తందారుగా తన సొంత ఆస్తి లాగా స్థాపించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి నెంబర్ టూ గా సుదీర్ఘకాలం చలామణి అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిందితుడుగా ఉన్న అనేక అక్రమార్జనలు, అవినీతి కేసులలో ఆయన సహచరుడిగా, ఏ–టుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి జగన్ తో పాటుగా తాను కూడా ఏడాదికిపైగా జైలు శిక్ష అనుభవించారు. ఈ ర్యాంకును కొనసాగిస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ మీద చాలా కాలం వరకు పెత్తనం సాగించారు. అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత మరియు అధికారంలో ఉన్న చివరి రోజులలో విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి కరివేపాకు లాగా తీసి పక్కన పెట్టడం అనేది.. ఆయన ఇప్పుడు ఈ రాజీనామా నిర్ణయానికి వచ్చేదాకా దారితీసినట్లుగా పార్టీలోనే ఒక ప్రచారం జరుగుతోంది.
జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో అంతటి కీలక నాయకుడిగా అందరిమీద పెత్తనం సాగించిన, దందాలు నిర్వహిస్తూ వచ్చిన విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా సుదీర్ఘకాలం కొనసాగిన తర్వాత జగన్ విశ్వాసాన్ని కోల్పోయారని చెప్పాలి. విశాఖపట్నం నగరాన్ని దోచుకోవడంలో జగన్ ను మించిన మోతాదుకు విజయసాయి దోపిడీపర్వం చేరుకుందనేది పార్టీ అధినేతకు ఫీడ్ బ్యాక్ అందినట్లుగా పార్టీ వర్గాల్లో గుసగుసలు ఉన్నాయి. ఆ క్రమంలోనే విజయసాయిని జగన్ పక్కన పెట్టారు. జగన్ తర్వాతి అధికార కేంద్రం ఎవరు అనే విషయంలో విజయసాయి– సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి వారి మధ్య తరచూ ఆధిపత్య పోరాటాలు జరుగుతూ వచ్చాయి. విజయసాయికి ప్రతి దశలోనూ ప్రతి వారితోనూ పరాభవమే ఎదురవుతూ వచ్చింది. తన మాట నెగ్గని పరిస్థితి ఏర్పడింది. అలాగే ఐ ప్యాక్ వారి విధానాలకు సమాంతరంగా విజయసాయిరెడ్డి కూడా ఒక వ్యవస్థను నిర్వహిస్తూ వచ్చారు. ఆ విషయంలో కూడా విజయసాయిరెడ్డికి జగన్ సహకారం లభించలేదని సమాచారం. అయితే ఐపాక్ మీద విజయసాయి పితూరీలను చెవిన వేసుకోవడానికి జగన్ ఇష్టపడలేదని పార్టీలో అనుకుంటున్నారు. దానితో పాటు ప్రస్తుతం పార్టీలో కీలక నిర్ణయాలలో భాగస్వామిగా ఎదుగుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో విజయసాయిరెడ్డికి పొసగలేదు అని కూడా వినిపిస్తోంది. ఈ విషయం అధినేత దృష్టికి తీసుకువెళ్లినా జగన్ పట్టించుకోలేదని సమాచారం. అవసరమైన సందర్భాలలో తనను కరివేపాకు లాగా వాడుకుని ఇప్పుడు విస్మరించారని విజయసాయిరెడ్డి ఆవేదనకు గురైనట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అసలే భవిష్యత్తు ఉంటుందా లేదా అనే ఊగిసలాటలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమే ఎక్కువ అనుకునే తరుణంలో, తన ప్రాధాన్యానికి కూడా గండిపడడంతో విజయసాయిరెడ్డి అనివార్యంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.