విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం ఎంతో కాలంగా ఎంత తపన పడుతున్నారో అందరికీ తెలుసు. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులైతే సుదీర్ఘకాలంగా తమ ఆందోళనలు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడానికి వీల్లేదని వారు అభ్యర్థిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వారి వెతల గురించి వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఐదేళ్లపాటు ఏమాత్రం పట్టించుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, కేవలం 6 నెలల వ్యవధిలోనే విశాఖ ఉక్కు సమస్యకు ఒక నిర్దిష్టమైన పరిష్కారం కనిపించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విశాఖ ఉక్కు పరిశ్రమకు 11500 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం ద్వారా ఆ పరిశ్రమలు ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం మామూలు విషయం కాదు! యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకించి ఉత్తరాంధ్రవాసులకు ఒక అద్భుతమైన వరంగా దీని గురించి చెప్పుకోవాలి.
విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలనే ఆలోచన మోడీ సర్కార్ హయాంలోనే జరిగింది. అయితే విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదంతో అప్పట్లో జరిగిన అతిపెద్ద ఉద్యమాల వలన సాధించుకున్న ఆ పరిశ్రమను వదులుకోవడానికి రాష్ట్రం ఇష్టపడలేదు. విశాఖ ఉక్కు కార్మికులు తమ పోరాటాలు ప్రారంభించారు. ఈ సమస్యను కేంద్రంలో నరేంద్ర మోడీల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తానని అప్పట్లోనే జనసేనాని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం నూటికి నూరు శాతం అవకాశవాద వైఖరిని అవలంబిస్తూ వచ్చారు.
విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్న వారిని జగన్ కాదు కదా, ఆ పార్టీలో ఏ ఒక్క నాయకుడు కూడా వెళ్లి పరామర్శించలేదు. జగన్ కు వాళ్ళు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విశాఖ ఉక్కును గట్టున పడేయడం గురించి ఆయన నామమాత్రంగా కూడా ఆలోచించలేదు. పైగా ప్రెవేటీకరణ జరిగితే.. విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన ఆస్తులను అమ్మేసి ఆ డబ్బు కూడా దండుకోవాలని ఆలోచనలు చేసినట్లుగా అప్పట్లో పుకార్లు వినిపించాయి. మొత్తానికి జగన్ మాత్రం విశాఖ ఉక్కు పై పూర్తి నిర్లక్ష్యాన్నే కనబరిచారు.
రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారు గద్దె ఎక్కిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. విశాఖ ఉక్కుకు గనులు కేటాయించడం దగ్గర నుంచి, ఆర్థిక ప్యాకేజీ కేటాయించడం వంటి అనేక అంశాలపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సందర్భం దొరికినప్పుడల్లా కేంద్రంలోని పెద్దలకు వివరిస్తూ వచ్చారు. మధ్యలో విశాఖ ఉక్కు పరిశ్రమను సందర్శించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా ప్రైవేటీకరణ ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని వెల్లడించారు. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ కూడా ధ్రువీకరించారు.
అయినా సరే వైసీపీ నాయకులు కల్లబొల్లి కబుర్లు కట్టిపెట్టలేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని చంద్రబాబు నాయుడు మీద నిందలు వేస్తూ వారు పబ్బం గడుపుకున్నారు. ఐదేళ్లపాటు తాము చేసిన మోసాన్ని ప్రజలు గుర్తించలేదనే వారు భావించారు. ఇప్పుడు వారి కుటిలయత్నాలకు చెక్ పెట్టేలాగా- కేంద్రం విశాఖపట్నం కోసం ఒక అత్యద్భుతమైన వరాన్ని ప్రకటించింది. విశాఖ ఉక్కు కోసం కేంద్రం ప్రకటించిన సహాయం పట్ల యావత్ రాష్ట్రంలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఎన్డీయే ప్రభుత్వ కృషి ఫలితం అని అంతా అభినందిస్తున్నారు.