జగన్ భక్త జర్నలిస్టులపై సుప్రీం సీరియస్!

చాలా మందికి జర్నలిజం అనేది కేవలం ఒక ముసుగు. తమ అక్రమ దందాలు సాగించడానికి, అవినీతి వ్యవహారాలు నడిపించడానికి.. రాజకీయ ప్రాపకం సంపాదించడానికి ఇది ఒక ఆయుధం. రాజకీయంగా కొందరు వ్యక్తులకు, ఏదైనా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ.. వారి మోచేతినీళ్లు తాగుతూ బతికే జర్నలిస్టులు సమాజంలో చాలా మందే ఉంటారు. ఈ వృత్తిని ఒక ముసుగుగా ధరించి, రాజకీయ భజనలలో తరిస్తుంటారు. అలాంటి జగన్ భజన చేసే ఒక జర్నలిస్టును సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మందలించింది.

విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబునాయుడు మీద గత అయిదేళ్లలో జగన్ సర్కారు ఎంత కక్షపూరితంగా వ్యవహరించిందో.. అందరికీ తెలుసు. తనను గేలిచేసిన వారందరినీ ఏ1 నిందితులుగా ఏదో ఒక కేసులో ఇరికించాలని తపన పడిన జగన్మోహన్ రెడ్డి.. స్కిల్ డెవలప్మెంటు కేసులో చంద్రబాబును అరెస్టు చేయించి.. ఎంత అరాచకంగా వ్యవహరించారో ప్రజలు చూశారు. ఆ కేసులో ఆయనకు బెయిలు రాగా.. ఆ బెయిలు రద్దు చేయాలంటూ ఏకంగా సుప్రీం కోర్టులో ప్రభుత్వం తరఫున పిటిషన్ కూడా నడిపారు. ఆ పిటిషన్ను ఇవాళ సుప్రీం కోర్టు కొట్టేసింది.

నిజం చెప్పాలంటే.. ఇదంతా రాజకీయ రభస. రాజకీయ కక్షలు కార్పణ్యాలకు సంబంధించిన సంగతి. అయితే ఇందులో జర్నలిస్టులు తలదూర్చే అవసరం ఏముంటుంది? జర్నలిస్టులకు సంబంధం ఏముంటుంది? అని ఎవరైనా అనుకుంటారు. కానీ.. చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంటు కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిలు మీద.. స్వర్ణాంధ్ర పత్రిక విలేకరిగా ఉన్న బాలగంగాధర తిలక్ సుప్రీం కోర్టులో బెయిలు రద్దుకోసం పిటిషన్ వేశారు. ఈ విషయంపై సుప్రీం సీరియస్ అయింది.

‘అసలు మీరెవరు? మీకేం సంబంధం? పిల్ దాఖలు చేయడానికి మీకున్న అర్హత ఏంటి?’ అంటూ ప్రశ్నించింది. బెయిల్ వ్యవహారాల్లో థర్డ్ పార్టీ ఎందుకుంటారని అడిగింది. ఇలా తలాతోకాలేని పిల్ లు వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా.. తను రాజకీయంగా కక్ష కట్టిన వ్యక్తుల మీద.. బయటి వ్యక్తులను కిరాయికి మాట్లాడుకుని వారితో కేసులు పెట్టించేవారని.. ఆ తర్వాత ఆ కేసులను ప్రభుత్వం సీరియస్ గా దర్యాప్తు చేయించి.. తను కక్ష కట్టిన వారిని వేధించేదని అయిదేళ్లలో అనేక గుసగుసలు ఉన్నాయి. చివరికి చంద్రబాబు బెయిలు రద్దు కోసం జర్నలిస్టు ముసుగులో జగన్ భజన పరుడైన ఒక భక్తుడు సుప్రీం దాకా వెళ్లగా అక్కడ అక్షింతలు తినాల్సి వచ్చింది. 

Related Posts

Comments

spot_img

Recent Stories