బొక్కిన బియ్యం లెక్కలు తేలుతున్నాయ్!

మాజీ మంత్రి పేర్ని నాని బెయిలు కోసం నిరీక్షిస్తున్నారు. తన గోడౌన్లను లీజుకు తీసుకుని ప్రభుత్వం నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా కాజేసిన కేసుల్లో ఆయన నిండా కూరుకుపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు.. వారిని విచారించిన తర్వాత.. మరో నలుగురిని కూడా అరెస్టు చేశారు. వీరినుంచి సేకరిస్తున్న సమాచారం మాజీ మంత్రి పేర్ని నాని పాత్రను కూడా నిర్ధరిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఒకవైపు వరుస అరెస్టులతో బియ్యం బొక్కిన నేరగాళ్లను పట్టుకుంటూ.. వారిద్వారా అసలు సూత్రధారి అయిన పేర్ని నాని చుట్టూతా పోలీసులు క్రమక్రమంగా ఉచ్చు బిగిస్తూ ఉన్నారు. మరొకవైపు పేర్ని నాని తననదైన వ్యూహరచనతో ముందుకు సాగుతున్నారు. అరెస్టు అయిన నిందితులతోనే ఆయన తెరవెనుక మంతనాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. బియ్యం మాయం వ్యవహారాల్లో నేరాల్ని పూర్తిగా వారే నెత్తిన వేసుకునేలా.. తన పాత్ర గానీ, తన భార్య జయసుధ పాత్ర గానీ ఏమాత్రం లేదని పోలీసులకు చెప్పేలా.. వారితో ఒప్పందాలకు బేరసారాలు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. పేర్ని నానికి చెందిన గోడౌన్ల నుంచి భారీ ఎత్తున రేషన్ బియ్యం మాయమైన వైనం తనిఖీల్లో అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఏ పాపమూ ఎరుగని అమాయకుడిలాగా.. పేర్ని నాని స్వయంగా తన గోడౌన్లో బియ్యం నిల్వల తేడా వచ్చినట్టు ప్రభుత్వానికి లేఖ రాసేస్తే సరిపోతుందనుకున్నారు. తేడా వచ్చిన రేషన్ బియ్యం నిల్వలకు కట్టదగిన జరిమానాను కూడా చెల్లించేశారు. తీరా అధికారులు క్షుణ్నంగా తనిఖీలు చేసిన తర్వాత.. ఆయన చెప్పిన లెక్కలకు రెట్టింపు కంటె ఎక్కువ బియ్యం మాయమైనట్టు తేలింది. మరో రెండు కోట్ల దాకా జరిమానా కట్టాల్సిందిగా నోటీసులు వెళ్లాయి.

ఈ వ్యవహారానికి సమాంతరంగా.. గోడౌన్లకు అధికారికంగా యజమాని అయిన ఆయన భార్య జయసుధను విచారించడానికి కూడా నోటీసులు ఇచ్చారు. గోడౌన్ మేనేజరు మానస్ తేజ్ తదితరులను అరెస్టు చేశారు. పేర్ని జయసుధకు కోర్టు బెయిలు ఇచ్చిన తర్వాత ఆమె విచారణకు హాజరైనప్పటికీ.. ఆ వ్యవహారాలు తనకేమీ తెలియదని చెప్పుకొచ్చారు. పేర్ని నానికి కూడా నోటీసులు వెళ్లాయి. ఆయన బెయిలు కోసం నిరీక్షిస్తున్నారు.

కాగా, మేనేజరు మానస్ తేజ్ ఖాతాలో 27 లక్షల అనుమానాస్పద లావాదేవీలు.. ఆయన నుంచి పేర్ని నానికి సుమారు రెండులక్షలు ట్రాన్స్ఫర్ అయి ఉండడం వంటివి పేర్ని నాని పాత్రను పట్టిస్తున్నాయి. కోళ్లదాణాగా, మండల లెవెల్ గోడౌన్లలో తేడాలకు సర్దుబాటుకు, రైస్ మిల్లుల్లో కల్తీకి వాడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ బాగోతాలతో నిమిత్తం ఉన్న మరో నలుగురిని అరెస్టు చేశారు. వీరీ అక్రమాలకు పాల్పడడానికి పేర్నినాని అందించిన అండదండల గురించి ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఆయన విచారణ త్వరలోనే తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories