జగన్ ఆదేశాలకు తూచ్ అనేస్తున్న నేతలు!

‘అధికారాంతమునందు చూడవలె అయ్యంగారి సౌభాగ్యముల్’ అని సామెత. ఇప్పుడు ఆ సామెత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా అతికినట్టు సరిపోయేలా కనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ అనేది ప్రజాస్వామ్య పోకడలు ఇసుమంతైనా కనిపించని, వినిపించని వ్యక్తిస్వామ్య, పెత్తందార్ల పార్టీ అనేది అందరికీ తెలుసు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అదే శాసనం. ఆయన నిర్ణయంలో మార్పు సూచించేవారుగానీ, సలహా చెప్పేవారుగానీ ఉండరు. అలా చెబితే వారిని పార్టీలో ఉండనివ్వరు. అలాంటి పార్టీలో కొనసాగేవారంతా.. జగన్ కు జీహుజూర్ అనే బ్యాచ్ మాత్రమే. కానీ ప్రస్తుత పరిణామాలను గమనిస్తోంటే.. ఆయన మాజీ అయిన తర్వాత.. ఆయన పట్ల నాయకుల్లో భయం, విశ్వాసం కూడా సడలిపోయాయా? అనిపిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి తాను మాత్రం ప్యాలెస్ నుంచి కదలకుండా, ట్వీట్ల పోరాటం మాత్రమే సాగిస్తూ.. తన పార్టీ వారిని మాత్రం రోడ్డు మీదకు వచ్చి పోరాటాలు చేయాల్సిందిగా పురమాయిస్తున్నారు. తీరా అవి క్షేత్రస్థాయిలో తుస్సుమంటున్నాయి.

గత నెల చివర్లో- విద్యుత్తు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో విద్యుత్తు శాఖ కార్యాలయాల ఎదుట దీక్షలు చేయాలని జగన్ పార్టీని ఆదేశించారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో చేసుకున్న ఒప్పందాల కారణంగానే.. ఇప్పుడు చార్జీలు పెరిగాయనేది ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికల సమయంలో.. అయిదేళ్లపాటు విద్యుత్తు చార్జీలు పెంచబోం అని తాము హామీ ఇచ్చామని, దానికి కట్టుబడి ఉంటామని, ఇది జగన్ చేసిన పాప ఫలితం అని ప్రభుత్వం చెబుతోంది. ఆ వాదన ప్రజలు నమ్మారు కూడా. అలాంటప్పుడు.. పెరిగిన చార్జీలకు వ్యతిరేకంగా దీక్షలు చేయాలనే సరికి ముందు పార్టీ వారికే జీర్ణం కాలేదు. సరే.. ఏదో అధినేత చెప్పాడు కదాని.. తూతూమంత్రంగా కొన్నిచోట్ల జరిపించారు.

అయితే సుమారు 19 నియోజకవర్గాల్లో జగన్ పిలుపు ఇచ్చిన పోరాటాల గురించి అసలు పార్టీ వారు పట్టించుకోనేలేదు. ఈ మేరకు పార్టీ స్థానిక నాయకుల నిర్లక్ష్యంపై జగన్ కు ఫీడ్ బ్యాక్ కూడా వెళ్లినట్టుగా పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆ నియోజకవర్గాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైన ఎందుకు చెప్పిన పనిచేయలేదో అడిగి తెలుసుకునే ఉద్దేశంతో జగన్ ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ పురమాయించిన తర్వాత.. పార్టీ చేయలేదు అంటే దాని అర్థం.. ‘ఏం చేసుకుంటావో చేస్కో’ అనే కదా.. మరి.. అసలే పార్టీనుంచి పలువురు నాయకులు విచ్చలవిడిగా రాజీనామాలు చేసి వెళ్లిపోతున్న నేపథ్యంలో.. జగన్ ఇలా తన ఆగ్రహం పేరుతో మరికొందరు నాయకులను దూరం పెట్టడం పార్టీకి శ్రేయస్కరమేనా? అనే వాదన కూడా వినిపిస్తోంది. అసలు జగన్ ఈ పోరాటాలకు పిలుపు ఇచ్చినప్పుడే ఇద్దరు తాజా మాజీ ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్ పార్టీని వీడిపోయారు. ఇప్పుడు ఉన్నవారిని కూడా జగన్ తరిమేస్తారా? అనే అనుమానం కార్యకర్తలకు కలుగుతోంది. కోప్పడకుండా బుజ్జగించుకునే పనిచేయాలని అంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories