జగన్ ఏలుబడి సాగిన రోజులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర ఉన్న ప్రతి చిల్లర నాయకుడు కూడా సోషల్ మీడియాలో ఏ రేంజిలో చెలరేగిపోయారో అందరికీ తెలుసు. నీచమైన అసభ్యమైన పోస్టులను ప్రతిపక్ష నాయకులకు చెందిన వారి మీద, వారి కుటుంబ సభ్యులైన మహిళల మీద కూడా పెడుతూ వైసిపి సైకోలు ఎన్నో దుర్మార్గాలకు పాల్పడ్డారు. కేవలం ప్రతిపక్ష నాయకుల మీద మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి, చెల్లెలు మీద కూడా ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టారు. అయితే సోషల్ మీడియా పోస్టులు పెడుతూ చెలరేగిన సైకోలందరూ ఒక ఎత్తు అయితే ఎలాంటి పోస్టులు పెట్టాలో స్వయంగా ప్లాన్ చేసి డిజైన్ చేయించి వారందరికీ కంటెంట్ పంపుతూ వారి ద్వారా సోషల్ మీడియాలో విషవ్యాప్తికి పాల్పడిన మహామహులు కొందరు ఉన్నారు. అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన పీఏ రాఘవరెడ్డి కూడా ఉన్నారు. ఇప్పుడు పీఏ రాఘవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి జాగ్రత్త పడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
వైయస్ అవినాష్ రెడ్డికి వైయస్ షర్మిలకు మధ్య పచ్చగడ్డి వేయకపోయినా సరే భగ్గుమనేంత వైరం ప్రబలిందనే సంగతి అందరికీ తెలుసు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కడప ఎంపీ నియోజకవర్గాన్ని వైఎస్ షర్మిల ఆశించడం, హాల్ టికెట్ తనకు కావాలని గతంలో జగన్ వద్ద పట్టు పట్టడం అనేది పాత వ్యవహారం! ఇటీవల ఎన్నికలలో ఆమె అవినాష్ రెడ్డి మీద నిశితమైన విమర్శలు చేస్తూ అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. ఆమె మీద కూడా అనేక అసభ్యమైన పోస్టులు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యాయి. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిలో వైయస్ జగన్ భార్య భారతి అనుచరుడిగా పేరున్న వరా రవీంద్ర రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పోస్టులు తన అకౌంట్ ద్వారా ప్రజల్లోకి వెళ్లాయే తప్ప, వాటి వెనుక ప్లానింగ్, కంటెంట్ పంపడం మొత్తం ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన పీఏ రాఘవరెడ్డి చూసుకునే వారని వరా రవీంద్ర రెడ్డి పోలీసు విచారణలో స్వయంగా వెల్లడించారు.
దానిని బట్టి రాఘవరెడ్డి మీద పోలీసు కేసులు నమోదు అయ్యాయి. సుదీర్ఘకాలం పరారీలో ఉన్న ఆయన కోర్టు నుంచి ఉపశమనం దక్కిన తర్వాత తిరిగి పులివెందులకు వచ్చారు. పోలీసులు ఆయనను మూడు విడతలుగా విచారించారు. ముందస్తు బెయలు కోసం రాఘవరెడ్డి పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు తాజాగా కొట్టివేసింది. దీంతో రాఘవరెడ్డిని పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అరెస్టు చేసి అతని ద్వారా కొత్త వివరాలు సేకరిస్తే కనుక, ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా ప్రమాదఘంటికలు మోగినట్లే అని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈమేరకు ఆయన ముందే జాగ్రత్త పడుతున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసులోకి తన పేరు ఎక్కడానికంటే ముందే అజ్ఞాతంలోకి వెళ్లే అవకాశం కూడా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.