బుకాయింపులొద్దు: జవాబుందా విజయసాయీ!

కాకినాడ పోర్టులో వాటాలను అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పెద్దలు, బెదిరింపుల ద్వారా చేజిక్కించుకున్నారనేది.. సీఐడీ ఎదుట నమోదైన కేసు. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తర్వాత.. భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని గమనించి.. ఈడీ కూడా కేసు నమోదు చేసింది. జగన్ మోహన్ రెడ్డి హయాంలో విచ్చలవిడి అరాచకత్వానికి కేంద్రబిందువులుగా ఉన్న ఆయన అనుచరులు, సహచరులు ఈ పాపంలో నిందితులుగా ఉన్నారు. సీఐడీ విచారణను తప్పించుకోవడానికి పార్లమెంటు సమావేశాల మిషమీద గతంలో గడువు తీసుకున్న విజయసాయి తాజాగా ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే ఆయన వైసీపీ నాయకులు చెప్పే రొటీన్ జవాబులకు భిన్నంగా కొత్త జవాబులు చెప్పారు.

కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్, సెజ్ లలో 3600 కోట్ల విలువైన షేర్లను కర్నాటి వెంకటేశ్వరరావు నుంచి విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి, వైవీసుబ్బారెడ్డి కొడుకు లాగేసుకున్నారనేది ఫిర్యాదు. అయితే సదరు కేవీ రావు ఎవరో తనకు తెలియదని ఎప్పుడూ చూడలేదని, ఎప్పడూ మాట్లాడలేదని విజయసాయి అంటున్నారు. ఆయన చెబుతున్న జవాబులే కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. ఆ కొత్త ప్రశ్నలకు జవాబులు విజయసాయి చెప్పగలరో లేదో మరి.

1) కేవీరావు ఎవరో నాకు తెలియదు. ఎక్కడా కలవలేదు. ఎంతో మంది ఎంపీ అయిన నన్ను కలుస్తుంటారు. ఈ కేవీ రావు నాకు తెలీదు. ఆయనకు నేనెప్పుడూ ఫోను చేయలేదు- అని విజయసాయి అంటున్నారు. కావాలంటే మే నెల కాల్ రికార్డ్స్ తెప్పించి చూడండి. నేను ఫోను చేసినట్టు తేలితే నా తప్పును అంగీకరిస్తాను అంటున్నారు.
సాధారణంగా.. విజయసాయి లాంటి నాయకులు ఇంత ఈజీగా కాల్ రికార్డులకు చిక్కుతారా? అనేది అసలు ప్రశ్న. ఇలాంటి నాయకులు.. తమ అనుచరులు, లేదా ఆ దగ్గరితనం కూడా లేని కొత్త వ్యక్తుల ఫోను నుంచి చేసి.. విషయం మొత్తం మాట్లాడతారు. లేదా… ఎక్కడా దొరక్కుండా ఉండడం కోసం వారు ఎంచుకునే అంతకంటె జాగ్రత్త అయిన మార్గం మరొకటి ఉంది. సదరు కేవీరావు వద్దకు తమ మనిషిని పంపి, తాము తమ మనిషికి మాత్రమే ఫోను చేసి, ఆ ఫోనులోంచే కేవీరావుతో మాట్లాడతారు. దానివల్ల.. మాట్లాడిన సంగతి కూడా ఎక్కడా బయటకు పొక్కదు. కాల్ రికార్డింగ్ వంటి ప్రమాదం కూడా ఉండదు. ప్రమాణాలు అడుగుతున్న విజయసాయి ముందు తాను ఆ పని చేయాలి.

2) కేవీ రావు తిరుమల స్వామి వద్దకు రావాలని కోరుతున్నా. ఆయన ఫిర్యాదులు నిజమైతే వెంకటేశ్వరస్వామి ఎదుట చెప్పాలి. అక్కడే నిజానిజాలు మాట్లాడుకుందాం అంటున్నారు.
ఇలాంటి విషయంలో కేవీరావుకు సవాళ్లు విసిరే ముందు- విజయసాయి తాను చెబుతున్న సంగతులన్నీ నిజమేనని, తాను స్వయంగా తిరుమల వెళ్లి ప్రమాణాలు చేయవచ్చు కదా. తాను రావుతో మాట్లాడలేదని మాత్రమే కాదు.. కాకినాడ సీపోర్టు వాటాలు చేతులు మారడంలో తన పాత్ర ఏ రకంగానూ లేదని, తాను ఎవ్వరి ద్వారానూ, ఏ రకంగానూ ఈ డీల్ ను ప్రభావితం చేయడానికి ప్రయత్నించలేదని విజయసాయి ప్రమాణం చేయగలరా? అనేది పన్జల ప్రశ్న.

మరి ఈ రెండు ప్రశ్నలకు విజయసాయి వద్ద జవాబులున్నాయా? ఆయన ఆలోచించుకోవాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories