రాజకీయ నాయకులు తాము అధికారంలోకి రావడానికి సహకరించిన వారికి, అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రత్యుపకారం చేయడం అనేది చాలా సహజమైన సంగతి. తనకు తాను దోచిపెట్టుకోవడం మీదనే ప్రధానంగా దృస్టి కేంద్రీకరించడం అనేది జగన్మోహన్ రెడ్డి తీరు. అదే ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. జగన్మోహన్ రెడ్డికి చెందిన సొంత సంస్థకు అడ్డదారుల్లో ఆయన తొత్తులు ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టిన తీరు ఇప్పుడు వారిని కేసుల్లో ఇరికిస్తోంది. జగన్ కరపత్రిక అయిన సాక్షి దినపత్రికకు అయిదేళ్ల పదవీకాలంలో ఏకంగా 371 కోట్ల రూపాయలు దోచిపెట్టినట్టుగా ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. ఈ దందాపై అప్పటి ఐఅండ్ పీఆర్ కమిషనర్ విజయకుమార్ రెడ్డి మీద ప్రస్తుతం ఏసీబీ కేసులు రిజిస్టరు చేశారు.
జగన్ పరిపాలన కాలంలో మొత్తం 859 కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు అన్ని పత్రికలకు కలిపి ఇచ్చారు. అందులో 43 శాతం అంటే 371 కోట్ల రూపాయలకు పైగా ఒక్క సాక్షికి మాత్రమే ఇచ్చారు. కేవలం ప్రకటనలు ఇవ్వడం మాత్రమే కాదు. బిల్లుల చెల్లింపులో కూడా సాక్షికి మాత్రమే పనులయ్యేవి. మిగిలిన అన్ని పత్రికల బిల్లులు పెండింగులో పెట్టేవారు. జగన్ ద్వేషించిన పత్రికలకు తప్పనిసరిగా ప్రకటనలు ఇవ్వాల్సి వచ్చినాసరే.. బిల్లులు చెల్లించకుండా పెండింగులో పెడుతూ వేధించారు.
ఈటీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాన్యూస్ చానెళ్లకు అసలు ప్రకటనలే ఇవ్వవద్దంటూ తన సిబ్బందికి అప్పటి కమిషనర్ విజయకుమార్ రెడ్డి పురమాయించారు. ప్రకటనల కేటాయింపు ఎంపిక వ్యవహారంలో పూర్తిగా నిబంధనల్ని పక్కన పెట్టారు. కేవలం ప్రకటనల్లో దోచిపెట్టడం మాత్రమే కాదు. సాక్షి ఉద్యోగులు చాలా మందిని ప్రభుత్వంలోకి తీసుకుని వారికి ప్రభుత్వమే లక్షల రూపాయల జీతాలు చెల్లించేలా కూడా అక్రమాలకు పాల్పడ్డారు. వైసీపీ సిఫారసులు ఉన్న అందరికీ రకరకాల ఉద్యోగాలు ఇచ్చారు. రిజర్వేషన్లు గట్రా ఏమీ లేకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా 137 మందిని డిజిటల్ కార్పొరేషన్ లో, 117 మంది ఐఅండ్ పీఆర్ లో నియమించుకున్నారు.
అంతకంటె ఘోరం ఏమిటంటే.. ప్రకటనల టారిఫ్ లను రివైజ్ చేయాల్సిందిగా సాక్షి కోరినప్పుడు వారు కోరిన దానికంటె అధికంగా టారిఫ్ అప్రూవ్ చేయడం! సాక్షి రూ.2626 ఒక చదరపు సెంటిమీటరుకు ధర ఇవ్వాలని కోరగా, రూ.2917 వంతున ఆమోదించి మరో దోపిడీకి తెరలేపారు. కేవలం ఈ నిర్ణయం వల్ల.. సాక్షికి 19.63 కోట్ల రూపాయలు అదనంగా దోచిపెట్టినట్టు అయింది. జగన్ సీఎం అయింది.. ప్రజలకోసమా, లేదా, తన సొంత కరపత్రికకు దోచిపెట్టుకోవడానికా అని ప్రజలు అనుకుంటున్నారు.