జగన్ వేధింపుల దళపతికి జైలు తప్పదా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తన ప్రత్యర్థులందరినీ వేధించడానికి పోలీసు యంత్రాంగాన్ని ఎంతగా వాడుకున్నారో అందరికీ తెలుసు. సీఐడీ డిపార్టుమెంట్ అంటేనే.. జగన్ ఆలోచనలను ముందే పసిగట్టి.. ఆయన కళ్లలో ఆనందం చూడడానికి, ఆయనకు కిట్టని వారందరిపై కేసులు పెట్టి వేధించే వ్యవస్థగా గత ప్రభుత్వ హయాంలో మారిపోయింది. చివరికి అమరావతి రాజధానికి అనుకూలంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టిన 60 ఏళ్లు దాటిన వృద్ధురాలిని కూడా సీఐడీ కేసులతో వేధించిన సంగతి అందరికీ గుర్తుంటుంది. అదే సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ తనకు నచ్చినంత ఘాటుగా ప్రత్యర్థుల్ని వేధించడం లేదని అనుకున్న జగన్, మధ్యలో ఎన్.సంజయ్ ను ఆ పదవిలోకి తీసుకువచ్చారు. జగన్ ప్రీతికోసం ఆయన మరింతగా రెచ్చిపోయి.. వేధింపుల వింగ్ కు జగన్ దళపతిగా పనిచేశారు. అలాంటి మాజీ సీఐడీ చీఫ్ ఎన్.

సంజయ్ ఇప్పుడు అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారు. సీఎస్ అనుమతి కూడా తీసుకున్న పోలీసులు ఆయన మీద ఏసీబీ కేసు నమోదు చేశారు. దాదాపు రెండుకోట్ల రూపాయల మేర జరిగిన అవినీతిలో ఆయన భాగం ఉన్నట్టుగా తేల్చారు.

ఎన్.సంజయ్- జగన్ పాలన కాలంలో అగ్నిమాపక శాఖ డీజీగా కూడా పనిచేశారు. అప్పట్లో ఆ శాఖలో ఎన్వీసీలను ఆన్ లైన్ లో జారీచేసే ప్రక్రియ పేరు మీద సౌత్రికా టెక్నాలజీస్ అనే సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు. వారు ఏ పనీ చేయకుండానే దాదాపు 60 లక్షల రూపాయలు చెల్లించేశారు. అలాగే సీఐడీ చీఫ్ గా ఉండగా ఎస్సీ ఎస్టీ చట్టం గురించి ఆ వర్గాల వారికి అవగాహన కల్పించాలనే కార్యక్రమాలు ప్లాన్ చేశారు. తమ శాఖ అధికారులతోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. వాటి కాంట్రాక్టును క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ కు ఇచ్చినట్టుగా 1.19 కోట్ల బిల్లులు చెల్లించేశారు. నిజానికి ఈ కార్యక్రమాల్లో వారు చేసినదేమీ లేదని విజిలెన్స్ నిగ్గు తేల్చింది.
ఇవన్నీ పక్కా ఆధారాల సహా తేలడంతో.. ఎన్ సంజయ్ పై ఏసీబీ కేసు నమోదు అయింది. ఆయన ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. త్వరలో విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఆయన అరెస్టు కూడా తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు.

చంద్రబాబునాయుడు ను అరెస్టు చేయడం దగ్గరినుంచి, అనారోగ్యంతో బెడ్ మీద ఉన్న రామోజీరావును విచారణ పేరుతో వేధించడం దగ్గరి వరకు అన్ని రకాల జగన్ వేధింపులకు ఎన్.సంజయ్ అప్పట్లో దళపతి గా ఉన్నారు. అప్పుడు చేసిన అతి పనులకు ఇప్పుడు ఆయన జైలు పాలయ్యే పరిస్థితి వచ్చింది. 

Related Posts

Comments

spot_img

Recent Stories