జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అనేక మంది సేవలను ఉచితంగా వాడుకున్నారు. చాలా మందికి ఎందుకూ కొరగాని జీతాలు ఇచ్చి.. తక్కువ డబ్బులతో ఎక్కువ పనులు చేయించుకున్నారు. వారందరికీ తొలినుంచి మన ప్రభుత్వం రాగానే.. మీ అందరికీ మంచి మంచి పోస్టులు ఇచ్చేస్తాం అంటూ ఊదరగొట్టారు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. సోషల్ మీడియా, ఇతర అవసరాలకోసం వాడుకున్న అనేక మందికి తన ప్రభుత్వం వచ్చిన తర్వాత.. అడ్డదారుల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు కట్టబెట్టేశారు. ఒక్కొక్కరికి లక్షల రూపాయల్లో జీతాలు ఫిక్స్ చేశారు. నియామకాలకు ఎలాంటి నియమ నిబంధనలూ అక్కర్లేదు.. వైసీపీ నాయకులు చెబితే చాలు ఎడాపెడా ఉద్యోగాలు ఇచ్చేయడమే అన్నట్టుగా వ్యవహరించారు. ఇలాంటి వారందరికీ ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టడానికి ఫైబర్ నెట్ ను ఒక అడ్డాగా ఎంచుకున్నారు. ఆ శాఖలోకి ఎన్ని వందల మంది ఉద్యోగాల రూపంలో చొరబడ్డారో ఎవ్వరికీ తెలియదు. వారు ఎలా ఉంటారో, ఎక్కడుంటారో, ఏ పనిచేస్తుంటారో కూడా ఆ శాఖకూ తెలియదు. కేవలం నెలనెలా వారి ఖాతాల్లోకి జీతాలు మాత్రం వెళ్లిపోతూ ఉంటాయంతే. ఈ దుర్మార్గపు నియామకాలకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలల తర్వాత మంగళహారతి పాడుతున్నారు. ఏపీ ఫైబర్ నెట్ లో 410 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తున్నట్టుగా సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించేశారు.
జగన్ సేవలో తరించిన వేలాది మందికి ఉద్యోగాలు కానుకగా సమర్పించింది గత ప్రభుత్వం. ఎప్పటికీ శాశ్వతంగా తానే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటానని, తాను చేసే పాపాలను పరిశీలించడానికి గానీ, పుటం వేయడానికి గానీ.. ముందుముందు ఎవ్వరూ రాబోరని కలలుగన్న జగన్మోహన్ రెడ్డి.. దారుణమైన పరాజయం తర్వాత ఇంటికి పరిమితం అయ్యారు. ఆయన భక్తులు కూడా.. అదే మాదిరిగా.. తమ నాయకుడికి ఓటమి ఉండదని నమ్మి.. ఇప్పుడు దెబ్బతింటున్నారు. కేసుల ఊబిలో చిక్కుకుంటున్న వారు కొందరైతే.. జగన్ నునమ్మి ఆయనకు సేవలందందించి.. ప్రతిఫలంగా ఫైబర్ నెట్ ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడు బజార్న పడుతున్నారు.
సంస్థ అవసరాలతో సంబంధం లేకుండా అప్పట్లో నియామకాలు జరిగాయని. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేసే వారికి కూడా ఫైబర్ నెట్ నుంచి జీతాలు చెల్లించారని ఇప్పటి సంస్థ ఛైర్మన్ జీవీరెడ్డి చెబుతున్నారు. త్వరలో మరో 200 మందిని కూడా గుర్తించి తొలగించనున్నట్టు ఆయన ప్రకటించడం విశేషం. మొత్తానికి జగన్ అడ్డదారుల్లో పంచిన కొలువులు.. ఇప్పుడు కొండెక్కుతున్నాయి.