రాష్ట్రంలోని ప్రజలందరూ ఇప్పుడు ఒకటే అనుకుంటున్నారు. ‘జగన్.. తమరు మొసలి కన్నీరు కట్టిపెట్టండి!’ అని మాత్రమే. అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకుంటూ ఉండడం.. చంద్రబాబునాయుడు సర్కారు సంకల్పిస్తున్నంత వేగంతో నగరం కూడా పూర్తయితే ఇక తనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం మానుకుని.. తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోవచ్చునని జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. ఇన్నాళ్లూ అమరావతి ప్రాంతాన్ని స్మశానంగా మార్చేసిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఆ నగరానికి కొత్త తేజస్సు వస్తుండేసరికి, ఆ నగరం పూర్తయితే గనుక.. తనకు రాజకీయ సమాధి తప్పదని భయపడుతున్నారు. అందుకే అమరావతి మీద విషప్రచారం చేస్తున్నారు. 60వేల కోట్ల రూపాయలు కేవలం ఒక్క రాజధాని మీదనే తగలేస్తే ఎలా.. అంటూ రాష్ట్ర ప్రజల్లో అనుమానాలు పుట్టించడానికి జగన్ తన వంతు కుటిలయత్నాలుచేస్తున్నారు. అయితే అమరావతి ప్రాజెక్టు గురించి.. అది ఎలా స్వయం సమృద్ధి ప్రాజెక్టు అవుతుందో ప్రభుత్వం ప్రజలకు వివరించి చెబుతుండగా.. వారందరూ జగన్ గురించి అనుకుంటున్న మాట ఒక్కటే. జగన్.. తమ మొసలి కన్నీరు కట్టిపెట్టండి.. అని మాత్రమే.
అమరావతి రాజధాని అనేది సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్టు అనే సంగతి చంద్రబాబునాయుడు మొదటినుంచి చెబుతూనే ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ పదాన్ని కూడా ప్రజల వద్దకు వెళ్లనివ్వకుండా తన వంతు కష్టం పడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేశారు. రాజధాని నిర్మాణం అంటే లక్ష కోట్ల రూపాయలు అవుతుంది. అంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు.
అయితే ఇప్పుడు ప్రభుత్వం 60 వేల కోట్ల రూపాయలతో పనులకు ఆమోదం తెలిపేసి.. శరవేగంతో పనులు జరిపిస్తూ ఉన్నది. జగన్ చేస్తున్న విషప్రచారానికి విరుగుడుగా మంత్రి నారాయణ ఇంకా అనేక వివరాలు వెల్లడిస్తున్నారు. రాజధాని నిర్మాణంలో ఉన్న కాన్సెప్టు అర్థం చేసుకోకుండా వైసీపీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ మంత్రి నారాయణ విరుచుకుపడ్డారు. ప్రజలపై ఒక్క పైసా కూడా భారం వేయకంుడా రాజధాని నిర్మిస్తాం అని పేర్కొన్నారు.
భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించిన తరువాత.. మిగిలిన భూములను ప్రభుత్వం విక్రయిస్తుందని.. తద్వారా వచ్చే డబ్బుతోనే అమరావతిని నిర్మిస్తాం అని నారాయణ చెబుతున్నారు. ప్రపంచబ్యాంకు, ఏడీబీ సంస్థల నుంచి తీసుకునే రుణాలను అమరావతి భూములను విక్రయించడం ద్వారా తీర్చేస్తామని, భవిష్యత్తులో అక్కడినుంచి వచ్చే ఆదాయంతో తీరుస్తామని నారాయణ అంటున్నారు. ఏ రకంగా చూసినా అమరావతి అనేది సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్టే. ఆ విషయం అర్థం చేసుకుంటున్న ప్రజలు జగన్ మొసలి కన్నీరు కట్టిపెట్టాలని అంటున్నారు.