పెద్ద హీరోల సినిమాలు అంటే సంగీత దర్శకులుగా పెద్దగా ఆప్షన్లు దొరకడం ఉండడం లేదు. అయితే థమన్ లేకపోతే దేవి శ్రీ ప్రసాద్ అన్నట్లు ఉంది. తాజాగా అనిరుధ్ కొన్ని సినిమాలకు చేస్తున్నాడు కానీ తన తీరు వేరు.అన్ని కథలకూ అనిరుధ్ సెట్ అవ్వడు. ఊర మాస్ సినిమాలు, పక్కా కమర్షియల్ మీటర్ లో సాగే కథలు అనిరుధ్ చేయడు. జీవి ప్రకాష్ అందించే సంగీతం కూడా పెద్ద సినిమాలకు సెట్ కాదు. అందుకే సంగీతం దగ్గర పేచీ వస్తోంది. ఉన్నవాళ్లతో సర్దుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే ఆ తరవాత టాలీవుడ్ కి భీమ్స్ మంచి ఆప్షన్ కాగలడన్న భరోసా ఇప్పుడిప్పుడే కలుగుతుంది. ‘ధమాకా’ సినిమాతో అదిరిపోయే సంగీతాన్ని అందించాడు భీమ్స్. ఈ సినిమా విజయంలో పాటలది కీలక పాత్ర. భీమ్స్‌కి మాస్ పల్స్ బాగా తెలుసన్న విషయం ధమాకాతో తెలిసిపోయింది. ఆ తరవాత ‘MAD’ రూపంలో మరో హిట్టు పడింది. అందులో పాటలన్నీ బాగా వైరల్ అయ్యాయి. ‘MAD 2’లో కూడా పాటలు బాగా వచ్చాయని టాక్. లడ్డూ గాని పెళ్లి పాట ఇప్పటికే బయటకు వచ్చేసింది. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సంక్రాంతికి విడుదల కానున్న సినిమాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఒకటి. వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో రూపుదిద్దుకున్న సినిమా ఇది. ఇందులో 4 పాటలు ఉన్నాయి. అందులో రెండు బయటకు వచ్చాయి. ఆ రెండూ ఇన్‌స్టెంట్ హిట్లే. ముఖ్యంగా రమణగోగుల పాడిన పాట అయితే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిపోయింది. ఈ హిట్ తో భీమ్స్ బిగ్ లీగ్ లోకి చేరిపోయింది.
మాస్, కమర్షియల్ సినిమాలకు తను మంచి ఆప్షన్ కాగలడు. మరీ ముఖ్యంగా భీమ్స్ ఉన్నాడంటే ఆడియో కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి. చిరంజీవి, బాలయ్య, నాగ్, రవితేజ… ఈ జోన్ హీరోలకు భీమ్స్ సంగీతం అందించగలడు. కమర్షియల్ గానూ సంక్రాంతికి వస్తున్నాం హిట్ కొడితే.. మన డైరెక్టర్లకు దేవి, తమన్ తరవాత ఇంకో ఆప్షన్ దొరికేసినట్లే.