ఎన్టీఆర్ కు హైదరాబాదు నగరం ఘననివాళి!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ.. రాజధాని నగరం హైదరాబాదు రూపురేఖలు మారడానికి కీలకంగా కృషి చేసిన వారిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగుజాతి మొత్తం అన్నగా పిలుచుకునే నందమూరి తారక రామారావు పాత్ర కూడా ఎంతో ఉంటుంది. అలాంటి రామారావుకు ఇప్పుడు భాగ్యనగరం ఘననివాళి అర్పించబోతోంది. హైదరాబాదులో అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో వంద అడుగులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీకి ప్రభుత్వం తరఫున స్థలం కేటాయించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు కూడా.

ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సారథి టీడీ జనార్దన్, ఎన్టీఆర్ కొడుకు మోహనకృష్ణ, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి.. ముఖ్యమంత్రి రేవంత్ వద్దకు వెళ్లి ఈ ప్రతిపాదనను ఆయన ముందుంచారు. స్థలం కేటాయిస్తే.. వంద అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుతో పాటు, ఎన్టీఆర్ నాలెడ్జి సెంటర్ కూడా నిర్మిస్తాం అని.. అలాగే.. మంచి పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అడిగారు. దీనికి రేవంత్ రెడ్డి అంగీకరించారు.
హైదరాబాదు నగర అభివృద్ధిలో ఎన్టీఆర్ పాత్ర కూడా ఎంతో ఉంటుంది. తెలుగుయూనివర్సిటీ వంటివి ఆయన హయాంలో వచ్చినవే. అలాగే ట్యాంక్ బండ్ తెలుగు ప్రముఖుల విగ్రహాలతో అద్భుతమైన పర్యటక ప్రాంతంలాగా రూపుదిద్దుకోవడం మొత్తం ఎన్టీఆర్ విజన్ అనే చెప్పాలి. పైగా ఎన్టీఆర్ ను ఎవ్వరూ ఒక ప్రాంతానికి చెందిన నాయకుడిగా చూడడం అంటూ జరగదు. అశేష ఫాలోయింగ్ ఉన్న సినిమా హీరోగా.. ఆయన ప్రాంతాలకు అతీతమైన ప్రజాదరణను సొంతం చేసుకున్నారు. ఆ పునాదుల మీదనే ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత.. పరిపాలనలో అదివరకు ఎవరూ ఎరగని కొత్త పోకడలను ఆయన రుచిచూపించారు. రాజకీయం అనేది కేవలం కొన్ని సామాజిక వర్గాలు, సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కానే కాదని ఆయన నిరూపించారు. కేవలం తన చరిష్మాతో అనేక మంది ఔత్సాహిక కొత్తవారిని ఎన్టీఆర్ నాయకులను చేశారు. ఇవాళ ఏ పార్టీలో ఉన్నప్పటికీ.. రాజకీయ ప్రముఖులుగా కొనసాగుతున్న వారిలో 70-80 శాతం ఎన్టీఆర్ భిక్షతో ఎదిగిన వారే అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని అద్భుతమైన రీతిలో ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories