జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో.. అనేక రకాలుగా సృజనాత్మకంగా, క్రియేటివ్ గా, కొత్త పద్ధతుల్లో రాష్ట్రాన్ని దోచుకుతిన్నారనే సంగతి అందరికీ తెలుసు. ఎవ్వరి ఊహకు కూడా అందని విధంగా రకరకాల విధానాల్లో ప్రభుత్వ సొమ్మును అయినవారికి దోచిపెట్టడానికి అధాకారాన్ని వారు వాడుకున్నారు. వందల మంది తమ పార్టీ సోషల్ మీడియా సైకోలకు డిజిటల్ విభాగంలో ఉద్యోగాల పేరుతో రికార్డులు సృష్టించి.. కోట్లాది రూపాయలు వేతనాలుగానే కాజేసిన చరిత్ర జగన్ సర్కారుది. ఇసుక, లిక్కరు మాఫియాలను ఏ రీతిగా నడిపించారో అందరికీ తెలుసు. అలాంటి ఇన్నోవేటివ్ దోపిడీ పద్ధతుల్లో భాగంగానే.. వ్యూహం సినిమా తీసి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ల మీద బురద చల్లడానికి జగనన్న చేతి అస్త్రంలాగా ఉపయోగపడిన దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏ మార్గంలో దోచిపెట్టారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
జగనన్న ఎన్నికలకు ముందుగా రాంగోపాల్ వర్మతో వ్యూహం సినిమా చేయించారు. ఆ సినిమా చేయడం కోసం రాంగోపాల్ వర్మకు జగన్ భారీగానే ముట్టజెప్పినట్టుగా అప్పట్లో రకరకాల పుకార్లు వచ్చాయి. ఎవరు డబ్బులిస్తే వాళ్లు కోరినట్టుగా సినిమాలు తీయడానికి, తనకు ఒక భావజాలం గానీ, వాస్తవాన్ని చెప్పాలనే ఆలోచన గానీ ఎప్పటికీ ఉండని రాంగోపాల్ వర్మ.. జగన్ ఎలా కోరుకుంటారో అలాగ సినిమా తీసి జనం మీదికి వదిలారు. ఆ వ్యూహం సినిమా ఎంత చెత్తగా తయారైందంటే.. పూర్తయిన తర్వాత.. విడుదల తేదీ కూడా ప్రకటించిన తర్వాత.. జగన్ ప్రివ్యూ చూసి.. చాలా మార్పు చేర్పులు చెప్పారని.. విడుదలను వాయిదా వేసి.. ఆ మార్పులన్నీ వర్మ చేశారని.. అప్పటికీ అది అతుకుల బొంతలాగానే తయారైందని అప్పట్లో వినిపించింది.
సినిమా తీసినందుకు వర్మకు ఇచ్చిన డబ్బు మాత్రమే కాకుండా.. మరో రూపంలో సర్కారు ఖజానా నుంచి కూడా ఆర్జీవీకి దోచిపెట్టినట్టుగా ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. ఈ సినిమాను ఏపీ ఫైబర్ నెట్ ద్వారా కూడా రాష్ట్రంలోని ప్రజలకు ప్రదర్శించారు. ఫైబర్ నెట్ ద్వారా ఒకరు ఒకసారి ఈ సినిమా చూస్తే ఆర్జీవీ సంస్థకు రూ.100 చెల్లించాలి. కానీ.. ఈ సినిమాను ఫైబర్ నెట్ ద్వారా చూసినది కేవలం 1863 మంది మాత్రమే. అంటే ఆర్జీవీ సంస్థకు ఇంచుమించుగా 2 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. కానీ.. జగన్ సర్కారు ఎంత చెల్లించిందో తెలుసా.. ఏకంగా 2.10 కోట్ల రూపాయలు.
ఈ గణాంకాలను ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గా ఉన్న జీవీరెడ్డి స్వయంగా ప్రకటించారు. జగన్ పరిపాలన కాలంలో ఫైబర్ నెట్ ద్వారా ఉద్యోగుల సంఖ్యను 108 నుంచి 1363కు పెంచేసి వారికి జీతాల రూపంలోనే నెలకు నాలుగు కోట్లు దోచిపెట్టిన వైనం కూడా ఆయన చెబుతున్నారు. ఏపీ ఫైబర్ నెట్ సకల అరాచకాల మీద కూలంకషంగా విచారణ సాగబోతున్నట్టుగా వెల్లడించారు.