అసలు జరిగిన దందా ఒకటి. ఆ దందాకు సంబంధించి బాధితులు ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడైతే తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం చిక్కిన తర్వాత సీఐడీ వద్ద కేసులు నమోదు చేశారు. ఆ కేసులు విచారణ మొదలైంది. డాక్యుమెంట్లు సేకరిస్తున్నారు. తనిఖీలు జరుగుతున్నాయి. అయితే ఒక నేరం సంగతి తేల్చడానికి సోదాలు జరుగుతూ ఉండగా.. అనూహ్యంగా అంతకంటె పెద్ద నేరం మరొకటి తెరమీదకు వచ్చింది. కాకినాడ పోర్టును వైవీసుబ్బారెడ్ది, విజయసాయిరెడ్డి దళాలు చేజిక్కించుకోవడం అనేదే ఇప్పటిదాకా బాహ్యప్రపంచానికి తెలిసిన సంగతి. బెదిరించి వాటాలు రాయించుకున్నారంటూ కేవీరావు చేసిన ఫిర్యాదు మేరకు విచారణ జరుగుతోంది. అయితే పోర్టులో సోదాలు జరుపుతున్న సమయంలో ఈ లావాదేవీల్లో భాగంగా భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టుగా కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో కేంద్ర ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఈడీ స్వయంగా రంగంలోకి దిగుతోంది.
కాకినాడ పోర్టుకు పవన్ కల్యాణ్ వెళ్లేవరకు ఆ పోర్టు యజమానులు ఎవరో.. అక్కడినుంచి దందాలు నడిపిస్తున్నది ఎవరో స్పష్టత లేదు. పవన్ కల్యాణ్ వెళ్లడం, ఆయనను కనీసం అనుమతించకుండా పోర్టు యాజమాన్య ప్రతినిధులు మొరాయించడం.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ లేవనెత్తిన సందేహాలు ఇవన్నీ కలిసి యజమాని ఎవరనే ప్రశ్నలను చర్చకు తెచ్చాయి. కేవీరావుకు చెందిన పోర్టు యాజమాన్యం వాటాలను.. జగన్మోహన్ రెడ్డి పాలన హయాంలో వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి తదితరులు బెదిరించి మరీ కారుచవకగా కొనుక్కున్నట్టు తెలిసింది.
తర్వాత కేవీరావు సీఐడీకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం వైవీసుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఏ1 గా సీఐడీ విచారణ జరుగుతోంది. తాజాగా ఈ కేసుకంటె పెద్దదైన మనీలాండరింగ్ వ్యవహరాం వెలుగులోకి వచ్చింది. ఈడీ రంగంలోకి దిగి విక్రాంత్ రెడ్డికి ఈ విషయంలో కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తాజాగా వార్తలు వస్తున్నాయి.
కేవీరావుకు చెందిన వాటాలను విక్రాంత్ రెడ్డి దక్కించుకోవడంలో స్వయంగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా జోక్యం చేసుకున్నట్టుగా.. విక్రాంత్ చెప్పినట్టు చేయాల్సిందిగా కేవీరావును బెదిరించినట్టుగా.. ఆయన మొరలను అస్సలు పట్టించుకోనట్టుగా కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. మనీలాండరింగ్ కేసులు కూడా నమోదు కావడంతో.. వైవీసుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు మరింత గట్టిగా బిగుసుకున్నట్టే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.