సాక్షి దినపత్రికతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉన్నదా? లేదా? ఈ ప్రశ్నకు సమాధానం రెండు తెలుగు రాష్ట్రాల్లో పసిపిల్లవాడిని అడిగినా చటుక్కున చెప్పేస్తారు. కానీ.. జగన్ మాత్రం.. కోర్టుకు ‘అబ్బెబ్బే.. సాక్షితో తనకు సంబంధమే లే’ అని చెప్పేసుకున్నారు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల అని సామెత చెబుతుందిగానీ.. వాస్తవంలో కోర్టు మాత్రం.. జంధ్యం చూపించాల్సిందే అంటుంది. అదే తరహాలో.. సాక్షి అనేది జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికే అని ప్రపంచం అంతా నమ్మినప్పటికీ.. కోర్టు మాత్రం అందుకు సాక్ష్యాలు చూపించాలని అంటుంది. అలాంటి సాక్ష్యాలు సేకరించే పనిలోనే ఉన్నారు ఇప్పుడు మంత్రి నారాయణ!
ఇంతకూ విషయం ఏంటంటే.. జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిన రోజుల్లో జగన్ కు చెందిన సాక్షి దినపత్రికలో అప్పటికి మాజీ మంత్రిగా ఉన్న నారాయణ మీద కూడా అనేక అవినీతి, తప్పుడు కథనాలు ప్రచురించారు. ఆ కథనాలపై నారాయణ కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఆదావాలో జగన్ ను కూడా ప్రతివాదిగా చేర్చారు. అది కాస్తా పూర్తిగా జగన్ మెడకు చుట్టుకుంది.
సాక్షి దినపత్రికతో తనకు సంబంధం లేదని, ఆ దావా నుంచి ప్రతివాదిగా తనను తప్పించాలని జగన్ కోర్టుకు విన్నవించుకున్నారు. తమాషా ఏంటంటే.. అసలు తమ వార్తల్లో తప్పులేదని వారు చెప్పుకోవడం లేదు. సాక్షి మీద కేసు ఎలాగైనా నడుపుకోవచ్చు గానీ.. సాక్షి సంస్థతో తనకు సంబంధం లేదు గనుక.. తనను వదిలేయండి అని మాత్రమే జగన్ కోర్టుకు నివేదించుకుంటున్నారు. ఆ పరువునష్టం దావా విచారణ సందర్భంగా.. సాక్షితో సంబంధాల గురించి ప్రశ్నించినప్పుడు.. దానికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించి కోర్టు ముందు ఉంచుతామని నారాయణ తరఫున న్యాయవాదులు చెప్పారు.
చూడబోతే.. ఈపరువునష్టం కేసు జగన్ కు చిక్కులు తెచ్చిపెట్టే విధంగానే కనిపిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే. జగన్ భార్య భారతి స్వయంగా సాక్షి గ్రూపుకు ఛైర్మన్ గా ఉన్నారు. సాధారణంగా రాజకీయాలకు సంబంధించినంత వరకు భార్యభార్తలను వేరువేరుగా చూడరు. ఎన్నికల నామినేషన్ వేసేటప్పుడు అఫిడవిట్ లో కూడా తన ఆస్తులతో పాటు, భార్య పేరిట ఉన్న సమస్త ఆస్తులను కూడా చూపించాల్సి ఉంటుంది. అవన్నీ అదే వ్యక్తికి చెందినవిగా ప్రభుత్వం పరిగణిస్తుంది. సాక్షి గ్రూపుకు భారతి ఛైర్మన్ గా ఉన్నప్పుడు.. ఆ పత్రికతో తనకు సంబంధం లేదని జగన్ చెప్పడం న్యాయస్థానం ఎదుట చెల్లదని నిపుణులు అంటున్నారు. అయితే.. కేవలం అది మాత్రమే కాకుండా ఆయన సాక్షి బోర్డు రివ్యూమీటింగుల్లో, ఎడిటోరియల్ రివ్యూ మీటింగుల్లో పాల్గొన్న ఆధారాలను కూడా సేకరించబోతున్నట్టుగా తెలుస్తోంది. సాక్షితో జగన్ బంధం తేలిందంటే.. పరువునష్టం కేసులో ఆయనకు చిక్కులు తప్పవని పలువురు విశ్లేషిస్తున్నారు.