బుకాయింపులాగా ఉన్న అల్లువారి వివరణ!

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతిచెందడం, ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతుండడం అల్లు అర్జున్ చుట్టూ ముసురుకున్న వివాదం అందరికీ తెలుసు. అయితే ఐసీయూలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను అల్లు అరవింద్ స్వయంగా వచ్చి పరామర్శించి వెళ్లారు. పద్నాలుగు రోజులుగా కనీసం బాలుడిని చూడడానికి అల్లు అర్జున్ ఎందుకు రాలేదు అనే విషయంలో ఆయన సుదీర్ఘమైన వివరణ కూడా ఇచ్చారు. కానీ బాధిత బాలుడిని చూడడానికి రాకపోవడం గురించి అల్లు అరవింద్ ఇచ్చన వివరణ డొంకతిరుగుడుగా, బుకాయింపుగా ఉన్నదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

పుష్ప సినిమా విడుదల సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడం ఓపెన్ టాప్ వాహనం మీదనుంచి ప్రేక్షకులకు అభివాదం చేస్తూ లోపలకు వెళ్లడం.. ఆ సందర్భంగా తోపులాట.. అల్లు అర్జున్ కు చెందిన మనుషుల్ని జనాల్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో తొక్కిసలాట మహిళ మృతి ఇవన్నీ అందరికీ తెలుసు. అర్జున్ ఈ విషయంలో అరెస్టు అయ్యారు. ఒక రాత్రి జైల్లోనే గడిపి, బెయిలుపై బయటకు వచ్చారు కూడా. బాధితులకు అండగా నిలుస్తామని, వారికి డబ్బులిస్తామని, చికిత్స మొత్తం భరిస్తామని రకరకాల ప్రకటనలు చేశారు తప్ప.. అర్జున్ స్వయంగా వెళ్లి చూడడం జరగలేదు.

అయితే అల్లు అరవింద్ వివరిస్తూ.. ప్రమాదం జరిగిన మరు రోజే అల్లు అర్జున్ ఆస్పత్రికి రావాలనుకున్నారని, అయితే ఘటన జరిగిన వెంటనే అలా రావడం వద్దని ఆస్పత్రి అధికారులు వారించారని, అదే రోజు కేసు కూడా నమోదు కావడంతో.. తర్వాత వెళ్లి పరామర్శించడానికి తమ న్యాయవాది నిరంజన్ నో చెప్పారని చెప్పుకుంటూ వచ్చారు. అల్లు అర్జున్ స్వయంగా కోరడంతో ఇవాళ తాను వచ్చినట్టు కూడా చెప్పారు. అయితే ఆయన వివరణ పలు సందేహాలకు తావిస్తోంది.

చుట్టూ బౌన్సర్లను పెట్టుకుని, పెద్ద కాన్వాయ్ తో నానా హంగామా చేస్తూ ఓపెన్ టాప్ జీపులో వెళితే ఏదైనా హడావుడి అవుతుందేమో గానీ.. ప్రమాదం జరిగిన మరురోజు అయినా సరే.. గట్టుచప్పుడు కాకుండా.. కేవలం అల్లు అర్జున్ ఒకరిద్దరితో కలిసి మొహానికి మాస్కు ధరించి ఆస్పత్రికి వెళ్లి ఉంటే ఎవరు పట్ఠించుకుని ఉండేవారు? కేసు నమోదు అయిన తర్వాత అయినా సరే.. ఆయన వెళ్లి పరామర్శిస్తే అదేమీ నేరం కాదు కదా! మోహన్ బాబు మీద ఏకంగా హత్యాయత్నం కేసు ఉన్నా సరే.. ఆయన చక్కగా వెళ్లి రిపోర్టరు కుటుంబాన్ని క్షమాపణ కోరారు. అల్లు అర్జున్ మీద ఉన్న అంతకంటె పెద్ద నేరం కాదు కదా.

పరామర్శను కూడా ప్రలోభ పెట్టడం కూడా ప్రతిసారీ చూడరు కదా. ఆ విషయానికి వస్తే అల్లు అర్జున్ అరెస్టు అయిన వెంటనే.. మరణించిన మహిళ భర్తతో ఆయనను విడుదల చేయాలని, దుర్ఘటనలో ఆయన తప్పులేదని చెప్పించారు. అది ప్రలోభాల ఫలితం అని ప్రజలు అనుకోకుండా ఉండరు కదా.. ఆస్పత్రికి వెళితే మాత్రం తప్పు అని ఎవరైనా అనుకుంటారా? అని ప్రజలు సందేహిస్తున్నారు. అర్జున్ రాకకు వివరణ ఇచ్చారు సరే.. అల్లు అర్జున్ ప్రత్యేకంగా కోరితే వచ్చానని అంటున్న అరవింద్ కు తాను స్వయంగా వెళ్లి చూడాలని పద్నాలుగు రోజులుగా అనిపించలేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories