ధర్మ పరిరక్షణపై భూమన మొసలి కన్నీరు!

హిందూ ధర్మానికి అపచారం జరుగుతున్నదిట! హిందూ ధర్మానికి చేటు జరుగుతోంటే.. పవన్ కల్యాణ్ ఏమీ పట్టించుకోకుండా ఊరుకుంటున్నారట. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలట. ప్రజలందరితో కలిసి పోరాటాలు సాగించాల్సి ఉన్నదిట.. ఈ మాటలు ఎవరైనా చిత్తశుద్ధి గల నాయకుడు చెబితే నమ్మవచ్చు. కానీ, స్వయానా తాను టీటీడీ ఛైర్మన్ గా ఉన్న రోజుల్లో తిరుమలలో అన్యమత ప్రచారాలను ప్రోత్సహించిన, అన్యమతస్తులు డిక్లరేషన్ పై సంతకాలు చేయాలని ఉంటే.. స్వయంగా దగ్గరుండి వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అలాంటి సంతకాలు చేయకుండా టీటీడీ మర్యాదను మంటగలిపిన వ్యక్తి ఇలాంటి ధర్మపన్నాలు మాట్లాడితే చాలా కామెడీగా ఉంటుంది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో హిందూ ధర్మానికి నష్టం జరుగుతున్నదంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు.

తిరుచానూరు సమీపంలో ఒక ఈవెంట్ జరిగింది. అందులో లిక్కర్ వినియోగం కూడా జరిగింది. అయితే పబ్ ను తలపిపంచేలా ఈ ఈవెంట్ నిర్వహించారంటూ పాపం.. భూమన కరుణాకర రెడ్డికి ఆవేదన ఉప్పొంగుతోంది. దేవదేవుడు కొలువైన తిరుపతిలో ఇలాంటి దుష్టసంస్కృతి వచ్చేసిందని ఆయన అంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి నగరంలో మద్యం వినియోగం పెరిగిందట. దీనివల్ల పవిత్రత దెబ్బతింటున్నది కాబట్టి.. తిరుపతి పవిత్రతను కాపాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉందని భూమన అంటున్నారు.

ఈ మాటలు చెప్పే నైతిక హక్కు భూమనకు ఏ రకంగా ఉన్నదో అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో.. తిరుమల వెళ్లేదారిలో భక్తులను భ్రష్టు పట్టించడానికి ముంతాజ్ హోటల్ అంటూ స్టార్ హోటల్ కు అనుమతులు ఇచ్చిన భ్రష్ట చరిత్ర ఆయన హయాంలోనే జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక దాని అనుమతులు రద్దు చేశారు. ఒక్క ఈవెంట్ గురించి భూమన మాట్లాడుతున్నారు. పోనీ.. తిరుపతి వ్యాప్తంగా లిక్కర్ వ్యాపారాన్ని నిషేధించేయాలనే ఎజెండాతో ఆయన పోరాటం చేయగలరా? అనుమతులతో ఈవెంట్ నిర్వహిస్తే దానిని ఆయన ఎలా తప్పుపడతారు? అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం. భూమనకు ఏం చేయాలో దిక్కు తోచక.. ధర్మపరిరక్షణ పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్నారని పలువురు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories