అమరావతి టూరిజంలో అసెంబ్లీ కూడా భాగమే!

ప్రపంచం తలతిప్పి చూసే రాజధాని నగరంగా అమరావతిని రూపుదిద్దుతానని చంద్రబాబునాయుడు ఎన్నడో ప్రతిజ్ఞ చేశారు. దానికి తగ్గట్టుగానే తొలిదశలో దాదాపు యాభై వేల కోట్ల రూపాయల అంచనా బడ్జెట్ లతో పనులు మొదలు కాబోతున్నాయి. ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసే అమరావతి నగరాన్ని పర్యాటక సందర్శకులు కూడా ఖచ్చితంగా చూడాలని అనుకుంటారు కదా.. మరి వారికోసం ప్రత్యేకంగా ఏం ప్లాన్ చేస్తున్నారు? అనే అనుమానం మనకు కలగొచ్చు. అమరావతి నగరంలో భాగంగా జరుగుతున్న నిర్మాణాలే.. పర్యటకులకు కూడా ఆసక్తి కలిగించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యేకించి 270 మీటర్ల ఎత్తుండే ఏపీ అసెంబ్లీ టవర్ నుంచి పర్యటకులు మొత్తం నగరాన్ని విహంగవీక్షణం చేసేలా నిర్మాణాలను ప్లాన్ చేస్తున్నారు.

అమరావతి రాజధాని నగర నిర్మాణానికి సంబంధించి దాదాపుగా ప్రతి రెండు రోజులకు ఒక అప్డేట్ వస్తోంది. తాజాగా 24,276 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త పనులకు సీఆర్డీయే ఆమోదం తెలిపినట్టు మంత్రి నారాయణ వెల్లడించారు. దీంతో ఇప్పటికి మూడు విడతలుగ 45,249 కోట్ల రూపాయల పనులకు ఆమోదం లభించినట్టు లెక్క. వీటిలో పలు పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయి.. నిర్మాణాలు  మొదలు కావడం ఒక్కటే తరువాయి.
తాజాగా అసెంబ్లీ భవనానికి 765 కోట్లు, హైకోర్టుకు 1048 కోట్లు, ఐదు ఐకానిక్ టవర్లకు 4,665 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించనున్నారు. వీటిలో అసెంబ్లీ భవనం 103 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఒక ఏడాదిలో అసెంబ్లీ 40 నుంచి 50 రోజులు మాత్రమే జరుగుతుంటుంది. మిగిలిన రోజుల్లో అసెంబ్లీ భవనం టవర్ ను పర్యటకులు వీక్షించవచ్చు.

ఏపీ అసెంబ్లీ టవర్ ఎత్తు 250 మీటర్లు ఉంటుంది. అంటే గుజరాత్ లో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల స్టాచూ ఆఫ్ యూనిటీ, అమెరికాలోని స్టాచూ ఆఫ్ లిబర్టీల కంటె ఎక్కువ ఎత్తు అన్నమాట. అసెంబ్లీ లేని రోజుల్లో పర్యటకులు ఈ టవర్ ను ఎక్కి అమరావతి నగర అందాలను వీక్షించవచ్చు. పర్యటకులకు కూడా ఆసక్తికరమైన ప్రాజెక్టులుగా ఐకానిక్ భవనాలు రూపొందబోతున్నాయి. వీటితో పాటూ నిర్మించే కార్యాలయాల టవర్లలో సీఎం కార్యాలయ భవనం టవర్ 47 అంతస్తులు ఉంటుంది. వీటన్నింటికీ ఇప్పుడు టెండర్లు పిలవబోతున్నారు. నిధుల కొరత కూడా లేకపోవడంతో.. పనులు శరవేగంగా జరిగే అవకాశం ఉంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories