తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ అత్యధిక కార్యకర్తల సభ్యత్వాలతో రికార్డు సృష్టించే దిశగా దూసుకువెళుతోంది. ఏపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్న పార్టీ.. శనివారం నాటికి 73 లక్షలకు చేరుకుంది. ఇన్ని సభ్యత్వాలు నమోదు కావడమే ఒక పెద్ద రికార్డు. అయితే.. కోటి సభ్యత్వాలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది. ఆ మేరకు రికార్డు సృష్టించడం లక్ష్యం కాగా.. చాలా సులభంగా ఆ టార్గెట్ అందుకుంటారని పలువురు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతానికి 73 లక్షల సభ్యత్వాలు నమోదు అయినట్టు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చెబుతున్నారు. ఈ గణాంకాలలో గొప్ప విషయం ఏంటంటే.. ఇందులో 54 శాతం కొత్తగా తొలిసారి సభ్యత్వం తీసుకున్న వాళ్లే అని ఆయన చెప్పుకొచ్చారు. అంటే దాదాపుగా 39.4 లక్షల మంది కొత్తగా తొలిసారి సభ్యత్వం తీసుకున్న వారే అన్నమాట. కొత్తగా ఓటర్లు అయిన యువకుల్లో తెలుగుదేశం పట్ల విపరీతమైన ఆదరణ కనిపిస్తోందనడానికి, చంద్రబాబునాయుడు నాయకత్వం మీద నమ్మకం వ్యక్తమవుతోందని అనడానికి ఈ కొత్త సభ్యత్వాలే పెద్ద రుజువు.
ఇంతమంది కొత్తగా సభ్యత్వాలు తీసుకున్న తీరును గమనిస్తే.. తక్కువ వ్యవధిలోనే కోటి మార్కును క్రాస్ చేయడం సాధ్యమవుతుందని అనుకుంటున్నారు.
2019 లో తెలుగుదేశం పార్టీకి 65 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటికి కి 73 లక్షల సభ్యత్వాలు వచ్చాయి. అందులో 40 లక్షలు కొత్తవాళ్లే అంటే 2019 నాటి పార్టీ సభ్యులు ఇంకా 35 లక్షల మంది వరకు సభ్యత్వాలు ఇంకా తీసుకోలేదన్నమాట. 2019లోనే సభ్యులుగా ఉన్నవారు.. మరణించిన వారు తప్ప.. మిగిలినవారందరూ ఇప్పుడు అసలే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సభ్యత్వం తీసుకోకుండా ఉండరు. అంటేఇంకా కనీసం 30 లక్షలకు పైగా పాత సభ్యులే సభ్యత్వాలు తీసుకోవాల్సి ఉన్నదన్నమాట. అక్కడికే కోటి సభ్యత్వాలు పూర్తవుతాయి.
తెలుగుదేశం పార్టీ అభిమానులకు మరో సంతోషకరమైన సంగతి ఏంటంటే.. తెలంగాణలో కూడా దాదాపుగా లక్ష వరకు సభ్యత్వాలు నమోదు అయ్యాయి. పార్టీ అక్కడ కూడా తిరిగి వేళ్లూనుకుంటుందని ఆశాభావ్యం వ్యక్తం చేస్తున్నారు.