సంధ్య థియేటర్ వద్ద 4వ తేదీన ఏం జరిగింది. పుష్ప 2 హీరో అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావడం ఒక్కటే అక్కడి తప్పు కాదు. ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక వివాహిత మరణించింది. ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాటకు కారణమైనందుకు హీరో అల్లు అర్జున్ మీద కేసు నమోదు అయింది. ఆయన హత్య చేశారని ఎవరూ అనడం లేదు. తొక్కిసలాట జరగడానికి కారణం అయ్యారనేది మాత్రమే కేసు. అయితే.. వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ప్రభుత్వాన్ని నిందించే పనిలో భాగంగా.. ఇప్పుడు కొత్త భాష్యాలు కూడా చెబుతున్నారు. అక్కడి జరిగిన దుర్ఘటనను హత్య కోణంలో పరిశీలించాలని అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడుతున్నారు.
రాంగోపాల్ వర్మకు సినిమాలు లేకపోయినా.. ఆయన ఏదో ఒక స్పైసీ మాటలతో సంచలనం రేకెత్తించేలా మాట్లాడగలరు కాబట్టి.. ఆయనతో ఇంటర్వ్యూలు చేయడానికి, తద్వారా తమ టీఆర్పీ రేటింగును పెంచుకోవడానికి వారు ఉబలాటపడుతుంటారు. అలాంటి ఒక చానెల్ లో రాంగోపాల్ వర్మ తాజాగా అల్లు అర్జున్ విడుదల అయిన తర్వాత పరిణామాలపై తన విలువైన ఇంటర్వ్యూ ఇచ్చారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన మహిళ మరణంతో అల్లు అర్జున్ కు ఏమాత్రం సంబంధం లేదని, ఆయన చాలా హాయిగా ఈ కేసు నుంచి నవ్వుకుంటూ బయటకు వస్తారని వర్మ జోస్యం చెబుతున్నారు.
అల్లు అర్జున్ స్వయంగా ఆ మహిళ మృతికి కారణం కాదని, ఆయన రాక సందర్భంగా అక్కడి జనాన్ని కంట్రోల్ చేస్తూ వచ్చిన, అర్జున్ పర్సనల్ సిబ్బంది కూడా ఆమెను తోయలేదని, ఆమెను వారు నెట్టలేదని, ఆ గుంపులో ఆమె కిందపడి మరణించేలా వెనుకనుంచి నెట్టిన వారు ఎవరో పోలీసులు కనిపెట్టాలని రాంగోపాల్ వర్మ అంటున్నారు. ఆమె నెట్టిన వారిపైకి కేసు వెళ్తుందని అంటున్నారు. రాంగోపాల్ వర్మకు తొక్కిసలాట అనే పదానికి అర్థం తెలిసినట్టుగా లేదు. తొక్కిసలాట వలన మరణం సంభవిస్తే.. వెనుకనుంచి ఎవరు నెట్టారనేది పాయింట్ కానే కాదు. ఎవరూ ఉద్దేశపూర్వకంగా ఒకరిని చంపేయడం కోసం నెట్టరు.
అలాగే అల్లు అర్జున్ కూడా ఆమె చనిపోవాలని కోరుకునే ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని కూడా ఈ కేసుయొక్క అర్థం కాదు. కానీ.. అనుకోకుండా అలా తొక్కిసలాట జరగడానికి సరైన భద్రత ఏర్పాట్లు చేయించుకోకుండా, వాటి గురించి పట్టించుకోకుండా, కారు సన్ రూఫ్ లోంచి బయటకు కనిపించి.. అభిమానులకు అభివాదం చేస్తూ సాగడం మాత్రమే కారణం అని కేసు పెట్టారు. ఈ కేసును వక్రీకరించి.. ఇంకో రకమైన రంగుపులమడానికి ఆర్జీవీ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.