సంధ్య థియేటర్ ఘటనలో టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ శుక్రవారం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే నేటి ఉదయమే బన్నీ మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యాడు. ఇక జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అంతా ఆయన ఇంటికి వస్తున్నారు. ఈక్రమంలోనే పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా అల్లు అర్జున్ నివాసానికి రానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి.
సాయంత్రం డార్లింగ్ వస్తారని తెలిపాయి. కాగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, రానా దగ్గుబాటి, నాగ చైతన్య, కె. రాఘవేంద్రరావు, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ సోదరులు, ఆర్. నారాయణమూర్తి, డైరెక్టర్ సుకుమార్, బివిఎస్ రవి, సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ, పుష్ప నిర్మాతలు నవీన్, రవిశంకర్, కొరటాల శివ, దిల్ రాజు,హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి తదితరరులు బన్నీ నివాసానికి చేరుకున్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ పై సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. నాని, రష్మిక , బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ వంటి వారంతా బన్నీ అరెస్ట్‌ను ఖండిస్తూ ట్వీట్లు పెట్టారు.బయటకు వచ్చిన తర్వాత బన్నీ మీడియాతో మాట్లాడారు. ” ఆ కుటుంబానికి జరిగిన బాధకర ఘటనకు నేను ఎంతగానో బాధపడుతున్నాను. అన్ని విధాలుగా అండగా ఉంటా. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదు. ప్రమాదవశాత్తూ జరిగింది.
అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో నా ప్రమేయం లేదు. కుటుంబంతో కలిసి నేను థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది సుమారు 20 ఏళ్ల నుంచి ఆ థియేటర్‌కు నేను వెళ్లడం జరుగుతుంది. దాదాపు 30 సార్లు అక్కడ సినిమా చూశా. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. త్వరలోనే ఆమె కుటుంబాన్ని కలుస్తా..” అని చెప్పాడు.