వర్మకు ఇంకా తిక్క కుదరలేదు!

పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో కొన్నాళ్లు పరారీలో ఉండి, కోర్టు ద్వారా ముందస్తు బెయిలు ఉపశమనం దొరికిన తర్వాత రాంగోపాల్ వర్మ మళ్లీ రెచ్చిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఆల్రెడీ ఏపీ ప్రభుత్వంతో సున్నం పెట్టుకున్న ఆయన, తాజాగా తెలంగాణ ప్రభుత్వంతో కూడా సున్నం పెట్టుకోవడానికి ఉత్సాహపడుతున్నారని అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టు అనేది హాట్ టాపిక్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీనుంచి పలువురు తమ శైలిలో స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ కూడా తన దైన శైలిలో ఎక్స్ వేదికగా నాలుగు ప్రశ్నలు సంధించారు.

పుష్కరాలు, బ్రహ్మోత్సవాల తోపులాటలో భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్టు చేస్తారా? ఎన్నికల ప్రచారంలో తొక్కిసలాటలో ఎవరైనా మరణిస్తే రాజకీయ నాయకులను అరెస్టు చేస్తారా? సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో ఎవరైనా చనిపోతే హీరో, హీరోయిన్లను అరెస్టు చేస్తారా? భద్రత ఏర్పాట్లను పోలీసులు నిర్వాహకులు తప్ప హీరోలు నాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు? అని వర్మ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు సంధించడం ద్వారా రాంగోపాల్ వర్మ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నట్టుగా అందరూ భావిస్తున్నారు.

వర్మకు తాను మేధావిని అనే అహంకారం చాలా ఉన్నదని అందుకనే ఇలాంటి వంకర ప్రశ్నలు సంధిస్తూ.. తనకు మించిన అజ్ఞానుల దృష్టిలో ‘భలే అడిగాడు కదా’ అనిపించుకోవడానికి ఆరాటపడుతుంటాడని ప్రజలు అనుకుంటున్నారు. పుష్కరాలు, బ్రహ్మోత్సవాలు, ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలంటే.. ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చి.. అంచనాగా ఎంతమంది జనం హాజరవుతారో కూడా వారికి గణాంకాలు చెప్పి తదనుగుణంగా భద్రత ఏర్పాట్లు చేయించుకోవాలి. వారు చెప్పే వివరాలను బట్టి.. పోలీసులు భద్రత నిమిత్తం పోలీసులను, ఇతర యంత్రాంగాన్ని ఏర్పాటుచేస్తారు. జనం పెరిగి తొక్కిసలాటలు జరగకుండా సరైన ఏర్పాట్లు ఉన్నాయో లేదో చెక్ చేసి అనుమతులు ఇస్తారు. ఇవన్నీ ఉన్నా కూడా ఏదైనా అనుకోనిది జరిగితే.. దానిని ప్రమాదంగా పరిగణిస్తారు.

కానీ సంధ్య థియేటర్ విషయంలో జరిగింది వేరు. అల్లు అర్జున్ చేసిన అతిపెద్ద నేరం.. పెద్ద కాన్వాయ్ రూపంలో ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా అక్కడకు వెళ్లడం. రిలీజ్ ప్రీమియర్ షో సందర్భంగా గుమికూడిన జనాలు.. దానికి తోడు అర్జున్ ఎక్స్ ట్రాలు.. ఇవన్నీ కలిసి తొక్కిసలాట జరిగాయి. అయితే సంధ్య థియేటర్ వద్ద.. అల్లు అర్జున్ ఇలాంటి కార్యక్రమం రూపంలో వస్తారని పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. పైగా పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యానికి హీరో హీరోయిన్లు థియేటర్ వద్దకు వచ్చే కార్యక్రమాలు పెట్టవద్దని ముందే లేఖ రాసినట్టుగా కూడా చెబుతున్నారు.

పోలీసు భద్రత లేకుండా, వారికి సమాచారం లేకుండా, సెలబ్రిటీ వస్తే జనాన్ని కంట్రోల్ చేయడానికి బారికేడ్లు వంటి ఏర్పాట్లు చేయకుండా.. నిర్వహించడం ఖచ్చితంగా నేరమే. అందుకు థియేటర్ యాజమాన్యం ఎంత బాధ్యులో, సదరు హీరో కూడా అంతే బాధ్యుడు. ఈ లోతులు తెలియకుండా.. దేవుళ్లను అరెస్టు చేస్తారా? వంటి ఎగస్ట్రా మాటలతో రాంగోపాల్ వర్మ తన పరువు తాను పోగొట్టుకుంటున్నారు.. అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories