‘జమిలి’పై నెక్ట్స్ ముందడుగు పడుతుందా?

మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక కీలకమైన ముందడుగు పడింది. చీటికి మాటికీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు తలెత్తుతుండడం.. తరచుగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదంటూ ఎక్కడో ఒకచోట అభివృద్ధి కార్యక్రమాలు స్తంభించి పోతుండడం.. వీటన్నింటినీ మించి.. అదుపు తప్పిపోతున్న ఎన్నికల నిర్వహణ వ్యయం.. ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని జమిలి ఎన్నికలను నిర్వహించాలని కేంద్రప్రభుత్వం సంకల్పించింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటుచేసి దేశంలోని అన్ని పార్టీల నాయకులతో అభిప్రాయాలు సేకరించి.. ఒక నివేదికను తయారుచేయించింది. జమిలి ఎన్నికల నిర్వహణకే మొగ్గేలా బిల్లులు తయారుచేశారు. మొత్తానికి తాజాగా కేంద్ర ప్రభుత్వ కేబినెట్ ఈ జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించింది. ఏ క్షణమైనా సరే.. జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంటు ఎదుటకు వచ్చే అవకాశం కూడా ఉంది.

అయితే.. ఈ బిల్లు కేబినెట్ తీర్మానం సాగినంత సాఫీగా పార్లమెంటు గండం దాటే అవకాశం ఉన్నదా? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మోడీ సర్కారు ఈ విషయంలో ఒక వ్యూహాత్మక ఎత్తుగడను అనుసరించింది. మామూలుగా అయితే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించాలనేది కేంద్రప్రభుత్వం ఆలోచన. కానీ.. స్థానిక ఎన్నికలు కూడా జమిలి ఎన్నికల కిందికి తీసుకురావాలంటే.. కేవలం రాజ్యాంగ సవరణ మాత్రం సరిపోదు. దేశంలో యాభై శాతం రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆ బిల్లుకు అనుకూలంగా తీర్మానాలు చేసి పంపాల్సి ఉంటుంది. కానీ.. ప్రస్తుతానికి దేశంలో ఎన్డీయేకూ అంత సీన్లేదు. యాభై శాతం రాష్ట్రాలనుంచి అనుకూల తీర్మానాలు తీసుకు రాగల పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు మాత్రం.. జమిలిగా నిర్వహించేలా బిల్లును రూపొందించారు. అందుకు కూడా రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. అంటే పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీని కేంద్రం సాధించాల్సి ఉంటుంది.

లోక్ సభలో ఏదో ఒక రీతిగా బిల్లను గట్టెక్కించుకోగల పరిస్థితి ఉన్నప్పటికీ.. రాజ్యసభ విషయానికి వస్తే బిజెపి నెగ్గుతుందా అనేది చాలా మందికి అనుమానంగా ఉంది. ప్రస్తుతం రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న కొన్ని ఎన్నికలు పూర్తయితే.. బిజెపి బలం కొంత పెరుగుతుంది గానీ.. అప్పటికి కూడా.. బిల్లును పై సభలో నెగ్గించుకునేంత బలం రాదు. మరి మోడీ సర్కారు ఎలాంటి వ్యూహరచన చేసి జమిలి ఎన్నికల బిల్లును రాజ్యంగ సవరణ ద్వారా చట్టం రూపంలోకి తేగలుగుతుందో వేచిచూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories