ఇల్లలకగానే పండగ కాదు అని సామెత. ప్రస్తుతం సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏదో జనాంతికంగా చెప్పుకోవడానికి, బిల్డప్ ఇవ్వడానికి ఆయన ఊరట లభించినట్టుగా భావించాలి. హైకోర్టు ద్వారా.. ఆయన ఏ విషయంలో అయితే అనవసరంగా భయపడ్డారో.. ఆ విషయంలో మాత్రమే ఊరట లభించింది. ఏ విషయంలో అయితే ఆయన తప్పించుకోవడానికి అవకాశం లేదో.. ఆ విషయంలో ఆయన ఆశ నెరవేరలేదు. అందుకోసం మళ్లీ కోర్టును ఆశ్రయించాలా? లేదా, కోర్టు చెప్పినట్టు తలొగ్గి నడుచుకోవాలా? అనే మీమాంసలో ప్రస్తుతం ఆర్జీవీ కోటరీ సతమతం అవుతోంది.
వ్యూహం సినిమా విడుదల సందర్భంలో రాంగోపాల్ వర్మ సినిమా ప్రమోషన్ల కోసం విచ్చలవిడిగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలుసు. సినిమా మొత్తం.. జగన్ భజన కాబట్టి.. చంద్రబాబు అండ్ కోను ఎంతగా తిడితే.. అంతగా సినిమా టికెట్లు అమ్ముడవుతాయనే వక్రమార్గాన్ని వర్మ అనుసరించారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేయించి తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాల్లో అసభ్య వ్యాఖ్యలను జోడించి పోస్టు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఇలాంటి తప్పుడు పోస్టుల భరతం పట్టే పని మొదలైంది. ఆటోమేటిగ్గా వర్మ మీద కూడా ఏపీలో పలు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఒంగోలుజిల్లా మద్దిపాడు పోలీసులు ఆయనకు ఆల్రెడీ విచారణకు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన గడువు కోరుతూ పరారీలోకి వెళ్లారు. మరోవైపు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన కోరిక మేరకు హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. అయితే.. అనేక షరతులు విధించింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని, పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వెళ్లాలని కూడా హైకోర్టు స్పష్టీకరించింది. ఈ ఉపశమనం ద్వారా ఆయన కేవలం అరెస్టు నుంచి రక్షణ మాత్రమే పొందగలుగుతున్నారు.
నిజానికి రాంగోపాల్ వర్మకు పోలీసు స్టేషన్లో అడుగుపెట్టనే కూడదనేది పట్టుదల. అందుకే ఆయన న్యాయవాదులు.. ఆన్ లైన్ లో వీడియో కాల్ ద్వారా విచారించేట్లయితే వర్మ ఎఫ్పుడైనా సరే హాజరవుతారంటూ.. పదేపదే నొక్కి వక్కాణించారు. అయితే అలాంటి ఏర్పాటుకు హైకోర్టు ద్వారా వారికి వెసులుబాటు లభించలేదు. రాంగోపాల్ వర్మ పోలీసులు పిలిచినప్పుడు నేరుగానే విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. లేకపోతే.. విచారణఖు సహకరించడం లేదని పోలీసులే కోర్టుకు నివేదించి బెయిలు రద్దు చేయిస్తారు. వీడియో కాల్ లో విచారణ అంటూ.. కాఫీ తాగుతూ బిల్డప్ లు ఇవ్వవచ్చునని కోరుకున్న వర్మకు ఆ కోరిక నెరవేరేలా కనిపించడం లేదు. మరి ఆయన మళ్లీ అందుకోసం కోర్టును ఆశ్రయిస్తారేమో చూడాలి.