ప్రజలు ఊహించగలిగిన అవినీతి, అరాచక వ్యవహారాలు కొన్ని! అయితే ఎవ్వరి ఊహలకు కూడా అందకుండా, రెండో కంటికి తెలియకుండా సాగిపోయిన అవినీతి, బెదిరింపు వసూళ్ల దందాలు మరికొన్ని. జగన్మోహన్ రెడ్డి సర్కారులో అవినీతి పరులుగా ముద్రపడిన బడా నాయకులు బాహాటంగానే వందల వేల కోట్ల రూపాయల దందాలను సాగించారు. తామేం తక్కువ తిన్నామా అన్నట్టుగా.. ఎమ్మెల్యేలు, చిన్న స్థాయి నేతలు కూడా.. తమ తమ పరిధిలో భారీగానే బెదిరింపులు వసూళ్లకు పాల్పడ్డారు. పాపాల పుట్ట పగిలినట్టుగా ఇప్పుడు ఒక్కొక్కటీ నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి విడదల రజని, తాను ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లోనే ఏ రకమైన బెదిరింపులతో స్థానికంగా అధికార్లను అడ్డు పెట్టుకుని వసూళ్లు సాగించారో.. వెలుగులోకి వచ్చింది.
పల్నాడు జిల్లా యడ్లపాడులోని లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి, అధికార్ల ద్వారా వారిని పదే పదే హెచ్చరించి.. ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లోనే విడదల రజని రెండు కోట్ల రూపాయల మేర వసూలు చేసినట్టుగా ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ వారు తేల్చారు. ఆమెతో పాటు ఆమె అనుచరులు, విశ్వాసపాత్రులైన అధికారులు కూడా అదే సంస్థ నుంచి డబ్బు కాజేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
2020 సెప్టెంబరు 4నాటికి విడదల రజని ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఆమె పిఏ రామక్రిష్ణ క్రషర్ యజమానుల వద్దకు వెళ్లి.. ఎమ్మెల్యే కలవాలనుకుంటున్నట్టుగా చెప్పారు. వారు వెళ్లి కలిసినప్పుడు ఆ క్రషర్ ను మూసేయకుండా ఉండాలంటే తనకు రూ.5 కోట్లు ఇవ్వాలని రజని బెదిరించారు. తర్వాత కొన్నాళ్లకే అప్టపికి గుంటూరు రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాషువా క్రషర్ లో తనిఖీలు నిర్వహించి.. అవతకవలకు ఉన్నాయని 50 కోట్లు జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. కొన్ని రోజుల తర్వాత పోను చేసి.. విడదల రజని చెప్పినట్టు చేస్తారా? లేదా, క్రషర్ సీజ్ చేసేయాలా అని బెదిరించారు. క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
ఈ ఒత్తిడి మధ్య క్రషర్ యజమానులు విడదల రజనిని అప్రోచ్ అయి.. ఆమెతో బేరం కుదుర్చుకుని ఆమెకు రూ.2 కోట్లు, పల్లె జాషువా మరియు ఆమె పిఏ రామక్రిష్ణకు చెరి పది లక్షల వంతున ఇచ్చినట్టుగా ఇప్పుడు నిగ్గు తేలింది. ఈ బెదిరింపులు, వసూళ్ల దందాల గురించి ఇప్పుడు కేసులు నమోదు కాబోతున్నాయి. మరి ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లోనే ఈ రేంజిలో తెగించి వసూళ్లు చేసిన విడదల రజని, మంత్రి అయ్యాక ఇంకెన్నెన్ని దందాలు నడిపించారో కదా అని ప్రజలు విస్తుపోతున్నారు.