పేర్ని నాని : ఎలుకల్లాగా  బొక్కేసి నంగనాచి కబుర్లు!

ప్రజల్లో ఆదరణ పలచబడిపోయిందనే సత్యాన్ని గ్రహించి.. ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకున్న నాటినుంచి.. మీడియా ముందు నోరేసుకుని విరుచుకుపడిపోవడం ఒక్కటే తన దైనందిన కార్యక్రమంగా, జీవితలక్ష్యంగా బతుకుతున్న వ్యక్తి మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అనే పేర్ని నాని. రాష్ట్రవ్యాప్తంగా పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారాల్లో వైఎస్సార్ కాంగ్రెస పార్టీ పెద్దలు ఎలాంటి దందాలు నడిపిస్తూ వచ్చారో.. చాటుమాటుగా సాగిపోయిన స్మగ్లింగు ద్వారా వేల కోట్ల రూపాయల అక్రమార్జనలకు ఎలా పాల్పడుతూ వచ్చారో ఇప్పుడు వెలుగుచూస్తున్న తరుణంలో.. పేర్ని నాని బాగోతం కూడా బయటకు వస్తోంది. తన గోడౌన్లను పీడీఎస్ బియ్యం నిల్వల కోసం ప్రభుత్వానికి అద్దెకు  ఇవ్వడం ద్వారా మాత్రమే కాకుండా.. ఎలుకలు బొక్కినట్టుగా గోడౌన్లలోని బియ్యం బొక్కిన వైనం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. దొరికేదాకా దొర.. దొరికిపోతే దొంగ అన్న సామెత చందంగా తమ తప్పుడు వ్యవహారాలు ఇక దాగవు అని తెలిసిపోయిన క్షణంలో ముందుగానే.. తానే ఒక లేఖ రాసి తప్పించుకోడానికి పేర్ని నాని కుటిలయత్నం చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నంలో పేర్ని నానికి గోడౌన్లు ఉన్నాయి. ఇవి దాదాపుగా 40 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోడౌన్లు. వాటిని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా పౌరసఫరాల సంస్థ 2020లో జగన్ సర్కారు అద్దెకు తీసుకుంది. అంటే తమ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. తన గోడౌన్లను సర్కారుకు లీజుకు కట్టబెట్టారన్నమాట. వీటిని బఫర్, ఇన్వెస్టర్ గోడౌన్లుగా వారు వాడుకుంటారు. అంటే ఇక్కడ మేనేజిమెంట్ మొత్తం.. వాటి యజమానులైన ప్రెవేటు వ్యక్తులదే. కేవలం పర్యవేక్షణ మాత్రం ప్రభుత్వ ప్రతినిధులు చేస్తారు. సిబ్బంది, మేనేజరు అంతా గోడౌన్ యజమాని మనుషులే ఉంటారు. ఇక్కడ నిల్వ ఉంచే బియ్యం బస్తాలకు నెలకు ఒక బస్తాకు రూ.5 వంతున ప్రభుత్వం అద్దె చెల్లిస్తుంది. ఆ రూపేణా ప్రతినెలా లక్షలాది రూపాయల సొత్తు పేర్ని నానికి చెల్లింపులు జరుగుతూ ఉంటాయన్న మాట.

ఇప్పుడు పీడీఎస్ బియ్యం గురించి నానా రభస జరుగుతున్న సమయంలో తన గోడౌన్లలో 3200 బస్తాలు తరుగు వచ్చిందని, వాటి ధర చెబితే తాను ప్రభుత్వానికి సొమ్ము కట్టేస్తానంటూ నవంబరు 27న పేర్ని నాని ప్రభుత్వానికి లేఖ రాశారు. అధికారులు తనిఖీలు నిర్వహించడంతో దాదాపు 185 టన్నుల మేర 3700 బస్తాలు మాయమైనట్టుగా గుర్తించారు. సర్కారు లెక్కల ప్రకారం దీని విలువ దాదాపు 90 కోట్లు ఉంటుంది. నియమాల ప్రకారం గోడౌన్లలో ఇలా సరుకు మాయం అయితే రెట్టింపు జరిమానా వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు పేర్ని నానిపై సివిల్, క్రిమినల్ చర్యలకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి.

గోదాముల వ్యాపారం ముసుగులో స్మగ్లింగ్ మరియు అక్రమ దందా నడిపిస్తూ వచ్చినట్టుగా ఇప్పుడు అంతా అనుమానిస్తున్నారు. అయితే బండారడం బయటపడడంతో పేర్నినానికి గడ్డుకాలం తప్పేలా లేదు. గోదాముల్ని కూడా బ్లాక్ లిస్టులో పెడతామని అధికారులు పేర్కొంటుండడం ఇంకో సమస్య. 

Related Posts

Comments

spot_img

Recent Stories