కేబినెట్లోకి నాగబాబు : కూటమి బంధంలో మరో మెట్టు!

ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి పార్టీలు.. సుదృఢమైన బంధంతో ముందుకు సాగుతున్నాయి. నిజానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనంత బలం సొంతంగా తెలుగుదేశం పార్టీ ఒక్కరికే ఉన్నప్పటికీ కూడా.. పొత్తు బంధాల్ని గౌరవిస్తూ.. రెండు పార్టీలకు సమానంగా అవకాశాలు కల్పిస్తూ చంద్రబాబునాయుడు అద్భుతమైన రాజనీతిని ప్రదర్శిస్తున్నారు. రెండు పార్టీలకు కూడా మంచి ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడం.. కూటమి బంధంలో మరో మేజర్ ముందడుగు అని చెప్పుకోవాలి.

కూటమి పార్టీలు ఐక్యంగా ఉండడం చూసి ఓర్వలేక కుటిల రాజకీయం చేసేవాళ్లు బోలెడు మంది ఉన్నారు. కూటమి పార్టీల మధ్య పొరపొచ్చాలు వచ్చాయని, లుకలుకలు మొదలయ్యాయని వక్రప్రచారం చేస్తూ ఆనందిస్తుంటారు. అలాంటి వారు.. ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్న సమయంలో రకరకాల తప్పుడు విషయాలను ప్రచారంలో పెట్టారు. మూడు స్థానాలు దక్కబోతుండగా.. మూడు పార్టీలు మూడు సీట్లు పంచుకోబోతున్నాయనే తప్పుడు ప్రచారం చేశారు. పవన్ కల్యాణ్ రాష్ట్రానికి నిధులు, ఇతర విషయాలు మాట్లాడడానికి ఢిల్లీ వెళితే.. ఆయన తన అన్నయ్య నాగబాబుకు రాజ్యసభ ఎంపీ పదవి తీసుకోవడానికి ఢిల్లీ పెద్దల్ని ఒప్పించి వచ్చారని ప్రచారం చేశారు. మీడియా కూడా అలాంటి తప్పుడు దారిలోనే నడవడంతో ఆ ప్రచారాలే వైరల్ అయ్యాయి.

ఇక్కడే చంద్రబాబునాయుడు తన రాజనీతిని ప్రదర్శించారు. నిజానికి రాజ్యసభలో బలహీనంగా ఉన్న భారతీయ జనతాపార్టీకి ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలన్నది ఎప్పుడో జరిగిన నిర్ణయం అనేది విశ్వసనీయ సమాచారం. భాజపాతో ఒక హామీ తీసుకున్న తర్వాతనే.. ఆర్.కృష్ణయ్య ఎంపీ పదవికి రాజీనామా చేశారని కూడా తెలుస్తోంది. అలాంటి నేపథ్యంలో.. నాగబాబుకు పదవి గురించి.. సాగిన తప్పుడు ప్రచారం కూటమిని ఇబ్బంది పెట్టేలా తయారైంది. దాంతో చంద్రబాబునాయుడే.. పూనిక వహించి.. ఆయనను రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుందాం అని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పటిష్టంగా ఉండడానికి ఎంతో కష్టపడిన.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులతో విస్తృత సంబంధాలు ఉన్న నాగబాబుకు పదవి దక్కడం పట్ల జనసేన శ్రేణులన్నీ ఆనందంగా ఉన్నాయి. అందుకే ఈ నిర్ణయం కూటమి బంధంలో మరో మంచి ముందడుగు అని పలువురు భావిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories