అదానీ నుంచి 1750 కోట్ల రూపాయల ముడుపులు స్వీకరించిన వ్యవహారంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల మీద వంద కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేయడం ద్వారా తప్పు చేశారా? ఈ నిర్ణయం ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అవుతుందా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనడుస్తోంది. ఇంతకు మించిన అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ.. క్రమంగా అవి జనబాహుళ్యంలో చర్చల నుంచి మరుగున పడిపోయే నేపథ్యంలో.. జగన్మోహన్ రెడ్డి స్వయంగా పరువునష్టం దావా వేయడం ద్వారా.. కొరివితో తల గోక్కున్నట్టుగా చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
సెకితో రాష్ట్రప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అదానీ సంస్థలు, ఆయా ప్రభుత్వాధినేతలకు దాదాపు 2100 కోట్ల రూపాయలపైగా లంచాలు ఇచ్చారనేది ఎఫ్బిఐ తమ దర్యాప్తులో రాబట్టిన ప్రధానమైన సంగతి. ఇలా భారత్ లో రాజకీయ నాయకులకు ముడుపులుఇవ్వడానికి అమెరికాలో అడ్డదారుల్లో నిధులు సమీకరించారు.. అనేది ఎఫ్‌బిఐ వారి విచారణలో తేలినందువల్ల.. అదానీ సంస్థల ప్రతినిధుల మీద అక్కడ కేసులు నమోదు చేశారు. అవినీతి, లంచాలు ఇవ్వజూపడానికి సంబంధించి అమెరికాలో చాలా కఠినమైన సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వారి నివేదికలో ఏపీ చీఫ్ మినిస్టర్ అని స్పష్టంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
అయితే జగన్మోహన్ రెడ్డి ఎఫ్‌బిఐ నివేదికలో జగన్మోహన్ రెడ్డి అనే తన పేరు లేదు గనుక.. తను సుద్దపూసని అని చాటుకుంటున్నారు. సెకితో ఒప్పందాలు జరిగిన సమయంలో ఏపీ ముఖ్యమంత్రి తానే కదా అనే సంగతిని ఆయన విస్మరిస్తున్నారు. సాధారణంగా ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించి మీడియాలో చర్చలు ఇప్పటికే పలచబడ్డాయి. అయితే జగన్ స్వయంగా రెండు పత్రికల మీద పరువునష్టం దావా వేయడం వల్ల.. రాచపుండును కెలుకుతున్నట్టుగా అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మామూలుగా అయితే జగన్ అవినీతి చేశారనే కథనాల్ని ప్రచురించేశారని, మళ్లీ మళ్లీ రిపీటెడ్ గా ప్రచురించడానికి ఏమీ అవకాశం ఉండదని.. అయితే ఇప్పుడు జగన్ వేసిన కేసు వల్ల.. పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారీ.. పత్రికలు మొత్తం జగన్ అవినీతి బాగోతం, అవినీతి చరిత్ర మొత్తం ప్రచురిస్తూ ఉంటాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ దావా ద్వారా జగన్ తన నెత్తిన తానే బురద చల్లుకోవడానికి ప్రిపేర్ అయినట్టుందని అంతా అనుకుంటున్నారు.