వైఎస్ అవినాష్ రెడ్డికి ఈ వ్యూహం కొత్త కాదు. వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ ఆయనను విచారణకు పిలిచినప్పుడు వారిని ఎన్ని రకాలుగా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడో.. ఎన్ని రకాల వంకర యుక్తులు ప్రయోగిస్తూ.. ఆ విచారణ పర్వాన్ని జాప్యం చేయడానికి తన వంతు కష్టం పడ్డాడో అందరూ గమనించారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కూడా అదే తరహాలో.. చిన్న విషయాల్ని రచ్చరచ్చ చేసి రాద్ధాంతంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. పోలీసులకు విచారణకు సహకరించకుండా సవాళ్లు విసురుతూ సంచలనంగా మారాలనుకుంటున్న పీఏ రాఘవరెడ్డి ధోరణికి కూడా సూత్రధారి పూర్తిగా వైఎస్ అవినాష్ రెడ్డే అనే వాదన కూడా స్థానికంగా వినిపిస్తోంది.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డి పోలీసులకు చిక్కిన తర్వాత అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తానుకేవలం పోస్టు చేసేవాడినని.. కంటెంట్ మొత్తం తనకు వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన పీఏ రాఘవరెడ్డి అలాగే సజ్జల భార్గవరెడ్డి నుంచి వచ్చేదని ఆయన పోలీసులకు చెప్పేశారు. కంటెంట్ గురించి అవినాష్ రెడ్డి, రాఘవరెడ్డి చర్చించుకునేవాళ్లని కూడా చెప్నేశాడు. అప్పటినుంచి రాఘవరెడ్డిని విచారించడానికి పోలీసులు ప్రయత్నిస్తుండగా.. ఆయన పరారయ్యారు. ఆయనకు గతంలోనూ 41ఏ నోటీసులు అందించారు. అయితే రాఘవరెడ్డి ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. బెయిలు సంగతి తేల్చలేదు గానీ.. 12వ తేదీ వరకు అరెస్టు చేయవద్దంటూ కోర్టు తీర్పు చెప్పింది. దాంతో ఆయన పరారీలోంచి తిరిగి పులివెందులకు వచ్చారు. పోలీసులు వచ్చి విచారణకు రమ్మంటే మరోసారి తనకు 41ఏ నోటీసులు కావాలంటూ కండిషన్ పెట్టారు. ఆ మేరకు పోలీసులు మరోసారి నోటీసులు కూడా ఇచ్చారు. సోమవారం ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
కాగా, విచారణలో రాఘవరెడ్డి నోరు తెరిస్తే.. అవినాష్ రెడ్డి పాత్ర కూడా మరింత బలంగా బయటకు వస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈలోగా.. తమను పదేపదే వేధిస్తున్నారని రచ్చ రచ్చ చేయడం ద్వారా, పోలీసులకు సహకరించకుండా మరింతగా రాద్ధాంతం చేయడం ద్వారా.. తమను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారనే ప్రచారం చేసుకోవచ్చునని అవినాష్ రెడ్డి అండ్ కో ఆరాటపడుతున్నట్టుగా కనిపిస్తోంది.