మంచు మోహన్ బాబు కుటుంబంలో సుదీర్ఘకాలంగా నివురుగప్పిన నిప్పులా రగులుతున్న గొడవలు ఒక్కసారిగా తారస్థాయికి చేరుకున్నాయా? తండ్రీ కొడుకులు కూడా ఒకరి మీద ఒకరు దాడిచేసేంత, లేదా దాడిచేయించేంత స్థాయికి ఆ విభేదాలు ముదిరిపోయాయా? అని రాష్ట్రం చర్చించుకోవాల్సినంత పరిస్థితి. మంచు మోహన్ బాబు విద్యాసంస్థ శ్రీవిద్యానికేతన్ కు సంబంధించిన యాజమాన్య హక్కులు, ఇతర ఆస్తి పంపకాల గొడవలు ముదిరి కుటుంబంలో కొట్టుకునే వరకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. అటు మంచు మనోజ్, ఇటు మంచు మోహన్ బాబు ఇరువర్గాలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టుగా తెలుస్తోంది.
మంచు కుటుంబంలో సుదీర్ఘకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. ప్రధానంగా మోహన్ బాబు పిల్లల మధ్య ఆస్తుల పంచాయతీ నడుస్తోంది. గతంలో మంచు మనోజ్, మంచు విష్ణు తగాదా పడి కొట్టుకున్నట్టుగా వార్తలు వచ్చాయి కూడా. ఒక రకంగా చెప్పాలంటే.. మంచు మనోజ్ ను కుటుంబ ఆస్తులు, విద్యానికేతన్ వ్యవహారాల నుంచి దూరం పెడుతూ వచ్చారు.
ప్రస్తుత వ్యవహారాలు గమనిస్తే.. విద్యానికేతన్ నిర్వహణ వ్యవహారం మొత్తం మంచు విష్ణు భార్య వెరోనికా చేతుల్లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. వాటాలను కూడా కొంత మేర విక్రయం ద్వారా ఆమె సొంతం చేసుకున్నట్టుగా చెబుతున్నారు. మొత్తం ఆమె పరిపాలనలోనే విద్యాసంస్థలన్నీ నడుస్తున్నాయి. పర్యవసానంగా మంచు మనోజ్ తన వాటాల కోసం తగాదా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.
శుక్రవారం రాత్రి తిరుపతి సమీపంలోని విద్యాసంస్థల వద్ద ఈ విభేదాలు, తగాదాలు తారస్థాయికి వెళ్లినట్టు తెలుస్తోంది. విద్యాసంస్థల్లో ఒక కీలక పదవిలో ఉన్న వినయ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి మంచు మనోజ్ మీద దాడి చేసి కొట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. మంచు మనోజ్ ఈ మేరకు 100కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే పోలీసులు రావడంతో మంచు మనోజ్- వినయ్ తదితరుల మీద ఫిర్యాదు చేశారు. దానికి జవాబుగా.. మంచు మోహన్ బాబు కూడా మంచు మనోజే వచ్చి తన అనుచరులతో తన మీదనే దాడి చేశారని పోలీసులకు చెప్పడమూ కూడా జరిగింది.
పోలీసు స్టేషన్లో రాతపూర్వక ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్ లు ఇంకా నమోదు కాలేదని సమాచారం. మొత్తానికి సుదీర్ఘకాలంగా మంచు కుటుంబంలో సాగుతున్న ఆస్తుల తగాదాలు ఇప్పుడు ముదిరి పాకాన పడ్డాయి. తండ్రీ కొడుకులు కూడా ఒకరినొకరు కొట్టే, కొట్టించే స్థాయికి వెళ్లినట్టుగా కనిపిస్తోంది.