ఎన్నారైలను అక్కున చేర్చుకోనున్న అమరావతి!

అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పుడు.. ఎన్నారై తెలుగువారు ఈ ప్రాజెక్టు పట్ల బాగా ఉత్సాహం చూపించడం అందరికీ తెలుసు. అమరావతి ప్రాంతంలో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ నిర్మాణం చేపడుతూ హాపీ నెస్ట్ ప్రాజెక్టును చంద్రబాబు సర్కారు గతంలో ప్రకటించినప్పుడు కూడా గంటల వ్యవధిలో మొత్తం సేల్స్ పూర్తయిపోవడానికి కూడా ఎన్నారైలు అధికసంఖ్యలో పెట్టుబడులతో ముందుకు రావడం ఒక కారణం.

అలాంటిది.. అమరావతి రాజధానికి ఇప్పుడున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొత్త జవం జీవం తీసుకువస్తున్న తరుణంలో ఈ ప్రాంతంలో ఎన్నారై పెట్టుబడులను విస్తృతంగా ఆహ్వానించడానికి వినూత్న కార్యచరణ ప్రణాళికతో ముందుకు వెళుతున్నది. ఇక్కడ స్థలాలు కొనదలచుకునే ఎన్నారైలకు అన్ని రకాల సేవలను అందించడానికి సీఆర్డీయే మరియు ఏపీ ఎన్నార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రాపర్టీ ఫెరసిలిటేషన్ సెంటర్ ను ప్రభుత్వమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి పూనుకుంటున్నది.

తొలినుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబునాయుడు నాయకత్వానికి ఎన్నారై వర్గాల్లో మన్నన, గౌరవం ఉంటున్న సంగతి అందరికీ తెలుసు. ఇవాళ ఐటీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతేజాలు స్థిరపడుతూ ఉన్నాయంటే.. అలాంటి ప్రయత్నానికి పునాదుల్లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఐటీ రంగం వేళ్లూనుకోవడానికి చేసిన కృషే ముఖ్యకారణం అనే గుర్తింపు అందరి వద్ద ఉంది. అదే సమయంలో ఎన్నారై వర్గాల్లో చంద్రబాబు దార్శనికత పట్ల కూడా అపారమైన నమ్మకం ఉంది. వెరసి అమరావతి ప్రాజెక్టుకు అక్కడ మద్దతు లభిస్తూ వచ్చింది. ప్రభుత్వం కూడా వారి పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటుచేస్తోంది.

ఎన్నారైలకు రెడ్ కార్పెట్ పరుస్తూ.. భూముల కొనుగోళ్ల విషయంలో న్యాయసలహాల దగ్గరినుంచి వర్చువల్ టూర్లతో స్థలాల పరిశీలన, రిజిస్ట్రేషన్లు సహా అన్నీ చేయించడానికి ఈ ఫెసిలిటేషన్ సెంటర్ వారికి సేవలందిస్తుంది. ఎన్నారైలు ఇక్కడ కొనుగోళ్లు చేయడానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడ్డానికి, దళార్ల చేతుల్లో మోసపోకుండా ఉండడానికి ఈ ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నారు. రెవెన్యూ మునిసిపల్ పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో ఈ సేవలు అందించనున్నట్టు సమాచారం. 

Related Posts

Comments

spot_img

Recent Stories