చంద్రదళంలో చేరనున్న జగన్ మాజీ డిప్యూటీ!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తీరు వల్ల మాత్రమే కాదు. అయిదేళ్లుగా సన్నిహితంగా జగన్ పనితీరును గమనించిన అనేకమంది ఆ పార్టీ నాయకులకు.. ఈ పార్టీకి ఇక ఎప్పటికీ భవిష్యత్తు ఉండదు గాక ఉండదు అనే అభిప్రాయమే కలిగింది. అందుకే.. 2024 ఓటమితో వారి అనుమానాలు, అభిప్రాయాలు పరిపూర్ణం కావడంతో చాలా మంది పార్టీకి రాజీనామా చేసేశారు. జగన్ కట్టబెట్టిన చట్టసభల పదవులను కూడా కాలదన్నుకుని.. ప్రత్యామ్నాయంగా కూటమి పార్టీలు ఏ హామీ ఇవ్వకపోయినా సరే చేరిపోయిన వారున్నారు. ఈ క్రమంలో జగన్ పార్టీలో కొనసాగడం మాత్రం వద్దు అని నిర్ణయించుకున్న వారే ఎక్కువ. అలాంటి వారిలో ఒక ముఖ్య నాయకుడు.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నాని (ఆళ్ల కాళీకృష్ణమోహన్) ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు.

గతంలో వైసీపీ హయాంలో ఏలూరునుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆళ్ల నాని.. పార్టీ ఓడిపోయిన తర్వాత.. రాజీనామా చేసేశారు. ఇక రాజకీయాలనుంచే విరమించుకుంటున్నట్టుగా ఆ సందర్భంలో ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో సౌమ్యులుగా ముద్ర ఉన్న కొద్ది మంది నాయకుల్లో ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ కూడా ఒకరు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి తయారయ్యి వచ్చే స్క్రిప్టు ల ప్రకారం.. నోటికి వచ్చినట్టల్లా.. ప్రత్యర్థులు విమర్శలు చేయడం, అర్థం పర్థం లేని వాదనలతో ప్రజల్లో చులకన కావడం వంటివి.. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న రోజుల్లో కూడా లేవు. అంతటి సౌమ్యుడైన నాయకుడు గనుకనే.. పార్టీ ఓడిపోయిన తర్వాత.. ఇక పూర్తిగా రాజకీయాల నుంచే వైదొలగాలని అనుకున్నట్టుగా అప్పట్లో ప్రకటించారు.
వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత.. ఆయన జనసేనలో చేరుతారని కొంత ప్రచారం జరిగింది. అయితే ఆళ్ల నానికి సన్నిహితుడైన ఒక విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ నేత చంద్రబాబు అనుమతితో నాని టీడీలో చేరడానికి ఒప్పించినట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మంగళవారం కేబినెట్ భేటీ తర్వాత.. చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరబోతున్నారు. ఆళ్ల నాని చేరికతో తెలుగుదేశం పార్టీకి అదనపు ఎడ్వాంటేజీ వస్తుందని కూడా పలువురు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories