వైఎస్ జగన్మోహన్ర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన భక్తులు, ఆప్తులు, ఆశ్రితులు అందరూ కూడా విచ్చలవిడిగా చెలరేగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అనుచరుల దందాలు ఒక ఎత్తయితే ఆయన ద్వారా వివిధ సేవల కాంట్రాక్టులు పొందిన వారి దందాలు మరొక ఎత్తు! కాంట్రాక్టులోని నిబంధనలను, ప్రమాణాలను పట్టించుకోకుండా వ్యవహరించడం జగన్ ఆశ్రితులైన వారు తమ ప్రత్యేకహక్కుగా భావించారు. ఆ రకంగా అడ్డగోలుగా దోచుకోవడానికి అలవాటు పడ్డారు. తీరా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత.. వారి సేవల్లోని లోపాలను గుర్తిస్తున్నప్పుడు, నిలదీస్తున్నప్పుడు ఈ కాంట్రాక్టు నుంచి మేం వైదొలగుతాం అంటూ జారుకుంటున్నారు. ఇప్పుడు 108, 104 సర్వీసుల నుంచి తప్పుకుంటామని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన అరబిందో సంస్థ వైనం గమనిస్తే అలాగే అర్థమవుతోంది.
అత్యవసర వైద్యం 108, సంచార వైద్యం 104 సేవలను అందించడానికి అరబిందో సంస్థ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన కాలంలో వేర్వేరుగా రెండు టెండర్లను దక్కించుకుంది. సంస్థ పెద్దే. అయితే వీరి నిర్వహణలో ఈ రెండు విభాగాలు 108, 104 సేవలు అత్యంత ఘోరంగా ఉన్నాయనే ఫిర్యాదులు బాగా వచ్చాయి. కాగ్ కూడా ఈ సేవల విషయంలో తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ రెండు విభాగాల సేవల విషయంలో గుర్తించిన అవకతవకలు, లోపాలను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికల ఆధారంగా వివర కోరుతూ అరబిందో యాజమన్యానికి ప్రభుత్వం నోటీసులు జారీచేసింది.
ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అయినప్పుడు.. ఆ సేవలందించే ఏ సంస్థ అయినా ఏం చేయాలి?వాటిని దిద్దుకుంటాం అని.. మళ్లీ అలాంటి పొరబాట్లు జరగకుండా చూసుకుంటాం అని సంజాయిషీ చెప్పుకుని సేవల్ని మెరుగుపర్చుకోవాలి. కానీ జగన బ్యాచ్ అరబిందో సంస్థ మాత్రం.. వారి బుద్దులకు తగ్గట్టే ప్రవర్తించింది. ఈ సేవల నుంచి తాము తప్పుకుంటాం అంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. జగన్ పాలన కాలంలో వారు ఏకంగా ఏడేళ్ల కాలపరిమితికి టెండర్లు దక్కించుకున్నారు. సేవాలోపాల్ని ప్రశ్నించేసరికి.. ఇంకా రెండున్నరేళ్ల గడువు ఉన్నప్పటికీ.. తప్పుకుంటాం అని జారుకుంటున్నారు. దీంతో ఈ సేవల నిర్వహణకు ప్రభుత్వం కొత్తగా మళ్లీ టెండర్లు పిలిచే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది.