బెయిలు మీద బాహ్యప్రపంచంలో ఉంటూ, ఒక దఫా అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రి బాధ్యతలను కూడా నిర్వర్తించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టుగా సీబీఐ, ఈడీ కేసులు సా..గుతున్న సంగతి అందరికీ తెలిసిందే. పాదయాత్ర రోజుల్లో ఒక తీరుగా, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక తీరుగా.. తాను స్వయంగా విచారణకు హాజరుకాలేనంటూ రకరకాల సాకులు చెబుతూ.. విచారణల్ని పద్ధతిగా నడవనివ్వకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో సుప్రీం కోర్టులలో డిశ్చార్జి పిటిషన్లు కూడా వేసి.. తన అవినీతి కేసులు విచారిస్తున్న కోర్టులు తుది నిర్ణయానికి రాకుండా అడ్డు పడుతూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ కేసుల వ్యవహారంలో కదలిక వచ్చే అవకాశం కనిపిస్తోంది. తొందర్లోనే జగన్ కేసుల విచారణలు శిక్షల దాకా తేలిపోయేలా వేగం అందుకోనున్న సంకేతాలు వస్తున్నాయి.
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఆలస్యం అవుతున్నదని.. ఏపీ డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణరాజు గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. కేసులు సవ్యంగా విచారణ సాగాలంటే వాటి విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్లో కోరారు. తమాషా ఏంటంటే.. దాదాపుగా దశాబ్దం కిందట నమోదైన కేసుల్లో ఇప్పటిదాకా విచారణ ఎందుకు ఆలస్యం అవుతున్నదని సుప్రీం ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. డిశ్చార్జి, వాయిదా పిటిషన్లు పైకోర్టుల్లో విచారణలో పెండింగులో ఉండడం వల్లనే అసలు కేసులు కూడా తేలడం లేదంటూ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
దీంతో ఆగ్రహించిన సుప్రీం న్యాయమూర్తి జగన్ అక్రమాస్తుల వ్యవహారాలకు సంబంధించి పెండింగులో ఉన్న అన్ని కేసుల వివరాలు తమకు పంపాలని, వాటిని బట్టి త్వరగా తెమిలేందుకు తగిన ఆదేశాలు ఇస్తామని పేర్కొన్నారు. ఈనెల 13లోగా అన్ని కేసుల వివరాలను సుప్రీంకు సమర్పించాల్సి ఉంటుంది.
అదే జరిగితే.. సుప్రీం తదనుగుణమైన ఆదేశాలు ఇచ్చిందంటే గనుక.. జగన్ కేసుల విచారణ వేగం పుంజుకుంటుందనే అభిప్రాయం న్యాయనిపుణుల్లో వ్యక్తం అవుతోంది. మహా అయితే ఏడాదిలోగా జగన్ మళ్లీ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.